Breaking News

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం

-కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి వ్యవహారాల మంత్రి జి.కిషన్ రెడ్డి
-అభివృద్ధిని ప్రోత్సహించే జర్నలిజం మీద దృష్టి పెట్టాలి
-నెల్లూరులో పత్రికా సమాచార కార్యాలయం నిర్వహించిన వార్తాలాప్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జి.కిషన్ రెడ్డి
-సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వారి పక్షపత్రిక న్యూ ఇండియా సమాచార్ గురించి పాత్రికేయులకు తెలియజేసిన కేంద్ర మంత్రి
-రాజకీయాలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలను దీని ద్వారా తెలుసుకోవచ్చని సూచన
-వివిధ ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించిన కేంద్ర మంత్రి
-ప్రజాస్వామ్య నాలుగో స్థంభంగా అభివృద్ధి కార్యక్రమాల అనుసంధానకర్తలుగా భాగస్వాములు కావాలని పిలుపు

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం కోసమే అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుందని, ప్రజలకు మేలు చేసే ఉద్ధేశమే అందులో ఉంటుందని, క్షేత్ర స్థాయిలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పాత్రికేయుల చొరవతో వాటిని సరిదిద్దవచ్చని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి వ్యవహారాల మంత్రి జి.కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమన్న ఆయన, ప్రజా స్వామ్య నాలుగో స్థంభంగా అభివృద్ధి కార్యక్రమాల అనుసంధాన కర్తలుగా పాత్రికేయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్యర్వంలోని పత్రికా సమాచార కార్యాలయం వారు, నెల్లూరులో నిర్వహించిన వార్తాలాప్ (పాత్రికేయుల వర్క్ షాప్) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జి. కిషన్ రెడ్డి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. పాత్రికేయులు, పోలీసులు, రాజకీయనాయకులకు పండుగలు, సెలవులు ఉండవని, సమాజం కోసం ఎవరి స్థాయిలో వారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తూ ఉంటారన్న ఆయన, ఈ క్రమంలో పాత్రికేయుల పాత్ర మరింత కీలకమైనదని తెలిపారు. వైద్యులు ఆరోగ్య సంరక్షణ, ఉపాధ్యాయులు విద్యాబోధన.. ఇలా ఒక్కొక్కరు తమ తమ బాధ్యతలు నిర్వహిస్తున్నా… పాత్రికేయులు మాత్రం సమాజాన్ని జాగృతం చేయటంతో పాటు, ప్రజలు – ప్రభుత్వం మధ్య వారధిగా విలక్షణమైన బాధ్యతను నెత్తిన వేసుకుని పని చేస్తారని తెలిపారు.

ప్రభుత్వ పథకాల గురించి పాత్రికేయులకు తెలియజేసే సంకల్పంతో వార్తాలాప్ కార్యక్రమాన్ని నిర్వహించిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పత్రికా సమాచార కార్యాలయాన్ని అభినందించిన ఆయన, ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, వాటి ద్వారా ప్రజలు ఎలా లబ్ధి పొందాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరం, ఎవరు అర్హులు, లబ్ధి పొందలేని వారికి ఇతర పథకాలు ఉన్నాయా లాంటి విషయాలను తెలియజేసేందుకు పాత్రికేయులు చొరవ తీసుకోవాలని సూచించారు. విమర్శించడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమన్న ఆయన, తెలుసుకుని విమర్శించాలి, మంచి కార్యక్రమాలను అభినందించాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమ విజయంలో ప్రజలు, పాత్రికేయులు పోషించిన పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి, అందరూ కలిసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రచురిస్తున్న పక్షపత్రిక న్యూ ఇండియా సమాచార్ గురించి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలన్నింటికీ ఈ పత్రిక తెలియజేస్తుందని, ఇందులో సమాచారం తెలుసుకోవచ్చని, విమర్శించడానికి కూడా ఈ పుస్తకం పనికొస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విలేకర్లు మరింత జాగృతమై ఉండాలని, అక్కడి ప్రజలకు ప్రభుత్వ పథకాల వివరాల గురించి తెలియజేసి, వారి వెనుక అండగా నిలబడాలని, ఇది పాత్రికేయులే గాక, ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, స్వచ్ఛభారత్, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మిషన్ ఇంద్రధనుష్, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన్, సాయిల్ హెల్త్ కార్డ్, ప్రధానమంత్రి ఉజ్జ్వల్ యోజన వంటి పథకాల గురించి ప్రస్తావించిన ఆయన, రాజకీయలు, పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందేందుకు ప్రతి ఒక్కరి చొరవ అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగా అభివృద్ధిని ప్రోత్సహించే పాత్రికేయానికి పెద్ద పీట వేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి, శిక్షణా ఐ.ఎ.ఎస్. అధికారిణి కుమారి విద్యాధరి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ సహా నెల్లూరుకు చెందిన పలువురు అధికారులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *