అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చిలకడదుంప ఎంత బరువు ఉంటుందండీ… మాములుగా అయితే కిలోకు ఐదారు తూగుతాయి. బాగా పెద్ద సైజ్ అయితే ఒక్కోటీ కేజీ అవుతుంది. కానీ ఈ చిలకడదుంప ఒక్కసారి చూడండి. ఏకంగా ఆరు కిలోలు బరువు పెరిగింది. అబ్బో ఎంత పెద్ద చిలకడ దుంపో అని అబ్బురపరిచేలా పెరిగింది. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం వెంకటాపురంకు చెందిన రైతు గంజాల స్వాములు తన మామిడితోటలో గూడూరు మల్లవోలు నుంచి తెల్ల చిలకడదుంప విత్తనాలు తెచ్చి అంతర్ పంటగా సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయం కావటంతో దుంపలు త్రవ్వించాడు. వాటిల్లో ఒక చిలకడదుంప భారీ సైజులో, వింతగా ఆశ్చర్యపరిచింది. చేతిలోకి తీసుకుని చూస్తే అబ్బో చాలా బరువుంది. కాటా పెడితే ఆరు కిలోలు బరువు వచ్చింది. ఇప్పుడు ఈ చిలకడదుంప ఇక్కడి రైతులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతపెద్ద చిలకడదుంప తన తోటలో ఉత్పత్తి కావటం పట్ల రైతు స్వాములు సంతోషం వ్యక్తం చేశాడు.