గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు తిరుపతి జిల్లా గూడూరు నందలి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ , సి.కే.దాస్ అకాడమీ చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ,కందుకూరు మరియు ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గూడూరు వారి సంయుక్త సహాయ సహకారాలతో 30 వ బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ శాస్త్రీయ ప్రాజెక్ట్ పోటీలను ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి వర్యులు శ్రీమతి వై అపర్ణ గారు స్థానిక గౌ. శాసన సభ్యులు వరప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అపర్ణ గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ రాష్ట్రం లోని 26 జిల్లాల నలుమూలల నుంచి విచ్చేసిన బాల శాస్త్రవేత్తలు , వారికి మార్గదర్శకత్వం వహించిన మార్గదర్శక ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయకర్తలు , అదనపు సమన్వయకర్తలు అందరిని రాబోయే రెండు రోజులపాటు శాస్త్రీయ ప్రాజెక్టు పోటీలను శాస్త్రీయ దృక్పథం మేలవించేటట్లుగా నిర్వహించవలసిందిగా ఆదేశించారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు వెలకపల్లి వరప్రసాద్ రావు తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు గల శాస్త్రీయ దృక్పథాన్ని బాల శాస్త్రవేత్తలకు చక్కగా అర్థమయ్యేటట్లు నిర్దేశించారు. 70 ఏళ్ల వయసులో కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి , ప్రధాన అంశమైన “ఆరోగ్యం మరియు సమాజ శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం “అనే అంశాన్ని పిల్లలకు చక్కగా వివరించారు. ఇంతవరకు తాను ఎటువంటి మాత్రలు వాడలేదని దానికి కారణం చక్కటి ప్రణాళికతో వ్యాయామం మరియు జీవన విధానం లో సైన్స్ పట్ల అవగాహన ఉండడమేనని తెలిపారు.
గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ తన ప్రసంగంలో నిత్యజీవితంలో జరిగిన సంఘటనను కళ్లకు కట్టినట్లుగా పిల్లలకు వివరించి రాబోయే బాల శాస్త్రవేత్తలను మరింత ఉత్తేజవంతులుగా చేసి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తయారు కావాలని ఆకాంక్షిస్తూ, ఉపాధ్యాయులను తల్లిదండ్రులను ఇద్దరినీ ఉద్దేశించి పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి వారికి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కళాశాల యాజమాన్యం తరఫున పరిపాలన అధికారి జే రామయ్య, కళాశాల ప్రధానాచార్యులు కె ధనుంజయ మరియు కె టి వేణుమాధవ్, ఉప విద్యాశాఖాధికారి అధికారి యు శివ ప్రసాద్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా అఫ్ కాస్ట్ జిల్లా సమన్వయకర్త కేడీ సారథి పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం తరఫున విద్యార్థులను ఉద్దేశించి ఉత్తేజవంతంగా ప్రసంగించిన ప్రధాన ఆచార్యులు కె ధనుంజయ గారు మాట్లాడుతూ దేశంలోనే 23 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లలో వారి కళాశాల ఒకటి అని తెలుపుతూ పిల్లలందరినీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ని సందర్శించి తమ ప్రాజెక్టులను అందులో ఉండే సామాగ్రిని శాస్త్ర సాంకేతిక విషయాలను తెలుసుకొని భవిష్యత్తులో వారు తయారు చేసే ప్రాజెక్టులలో వినియోగించాలనీ, మరియు పిల్లలు తయారు చేసి రాష్ట్ర స్థాయికి తీసుకువచ్చినటువంటి శాస్త్రీయ పరిశోధన పత్రాలలో కొన్ని ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ఉన్నత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో సహాయ సహకారాలు అందించి ప్రోత్సహిస్తామని సభాముఖంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఆప్ కాస్ట్ సభ్య కార్యదర్శి వర్యులు డాక్టర్ వై అపర్ణ గారు ఈ ప్రదర్శనను ప్రారంభించగా, ఆప్ కాస్ట్ అధికారి కే సుబ్బారావు వందన సమర్పణ చేశారు.
కార్యక్రమానికి సమన్వయకర్తగా నెల్లూరు జిల్లా ఆప్కాస్ట్ జిల్లా సమన్వయకర్త జెవి రమేష్ వ్యవహరించారు.