రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. వెంకట జ్యోతిర్మయి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక జువెనైల్ పోలీస్ యూనిట్, బాల సంక్షేమ పోలీస్ అధికారులు, జువెనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యులు మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
చట్టంతో విభేదించే బాలల విషయం లో పోలీస్ సంస్థ, న్యాయ వ్యవస్థ, పాటించవలసిన నియమాల గురించి తెలిపారు. అసలు పిల్లలు చట్టంతో విభేదించే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఈ దుస్థితికి ముఖ్య కారకులు ఎవరు? మొదలగు అంశాలను వివరించారు. పిల్లలతో తల్లిదండ్రులు ప్రేమగా మెలగాలని, వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని, వారు ఎటువంటి వ్యసనాలకు, చెడు స్నేహాలకు లోనవకుండా చూడాల్సిన బాధ్యత పెద్ద వాళ్ళదే అని పేర్కొన్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం బాలల పట్ల వివిధ సంస్థల బాధ్యతలు, నియమ నిబంధనలు గురించి గౌరవ న్యాయమూర్తి శ్రీమతి. పి. వెంకట జ్యోతిర్మయి వివరించారు.
ఈ సందర్భంగా ఫ్యామిలీ కోర్టు మరియు 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి సీ. హెచ్. రాజ గోపాల రావు జువెనైల్ జస్టిస్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల గురించి వివరించారు. పిల్లల వయస్సును ఏ పత్రాల ఆధారంగా పరిగణలోనికి తీసుకోవాలి, ఏ సమయాలలో వారితో విచారణ జరపాలి, విచారణ, కేసు దర్యాప్తు విషయం లో పాటించాల్సిన నిబంధనలు ఏమిటో వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, తదితర వ్యవస్థల పాత్ర ఏమిటో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి చట్టంతో విభేదించిన బాలలను పోలీస్ వారు కానీ న్యాయ వ్యవస్థ కానీ సానుకూలమైన వాతావరణంలో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ఆర్.రాజీవ్, తదితర న్యాయమూర్తులు, తూర్పు గోదావరి జిల్లా ఏ.ఎస్.పీ ఎం.రజిని, ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్టు డైరెక్టర్ కె. విజయకుమారి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఐ.శివ ప్రసాద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పి. సూర్య ప్రభావతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు జే. సంతోష కుమారి, జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యులు, పోలీసులు, ప్యానెల్ లాయర్లు తదితరులు పాల్గొన్నారు.