-జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీమారావు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
హై కోర్టు విడుదల చేసిన వివిధ ఉద్యోగాల ఖాళీల నోటిఫికేషన్ కు సంబంధించి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని న్యాయస్థానాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ నెల 21 నుండి జనవరి 2వ తేదీ వరకు నిర్వహించే పరీక్షా కేంద్రాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ. భీమారావు శనివారం ఉదయం తిరుపతి జిల్లా కోర్టు నుండి మూడవ అదనపు జిల్లా జడ్జి వై వీర్రాజు, జడ్జి ఎన్ నాగరాజు ల తో కలిసి పరిశీలించారు.
ముందుగా చంద్రగిరి మండలం, రామి రెడ్డి గారి పల్లి సమీపంలో ఉన్న కేఎంఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలను, తిరుపతి మండలం, చెర్లోపల్లి, జూపార్కు రోడ్డు లోని అయాన్ డిజిటల్ జోన్, మరియు పుత్తూరు లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఇంజనీర్ కళాశాలలో నిర్వహించే పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. స్టెనో గ్రాఫర్, గ్రేడ్ – 3, జూనియర్ సహాయకులు, టైపిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎగ్జామినర్, కాపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్లు, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినెట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు మూడు విడతలలో కంప్యూటర్ అథారిటీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, మొదటి విడతగా ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మూడో విడత సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయిని, పరీక్ష కేంద్రాలలో నెట్ కనెక్షన్ల్ ను, అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత పరీక్షా కేంద్రాల యాజమాన్యానికి ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ వారిని, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వైద్య సిబ్బందిని, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ,మందులు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని, త్రాగునీరు, వసతి కల్పించాలని, మరుగుదొడ్లు ఏర్పాటు, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు క్యాంటీన్ అందుబాటులో ఉండే విధంగా చూడాలని సంబంధిత వారిని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగే విధంగా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పరీక్ష కేంద్రాల కళాశాల యాజమాన్యం తదితర అధికారులు పాల్గొన్నారు.