-ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాల రాజు కలెక్టర్లకు సూచన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భూమిలేని నిరుపేదల కోసం జిల్లాలో ప్రభుత్వ అసైన్డ్ భూములు గుర్తించాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాల రాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో ముత్యాల రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాలలో ప్రభుత్వ భూముల లభ్యత, భూమి లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారు వివరాలు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అర్హులను గుర్తించి, జిల్లా స్థాయి అసైన్మెంట్ కమిటీలో ప్రతిపాదనలు పెట్టి ఆమోదం పొందవలసి ఉంటుందన్నారు. గ్రామాల్లో ఎస్సీలకు స్మశాన భూములు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూములు, స్థలాలు గుర్తించాలని, పంచాయతీలకు అప్పగించాలని కలెక్టర్లకు సూచించారు. కృష్ణా జిల్లాకు సంబంధించి జిల్లాలో 502 రెవెన్యూ గ్రామాలు ఉండగా 80 గ్రామాల్లో ఎస్సీలకు స్మశాన భూములు అవసరమని కలెక్టర్ పి రంజిత్ భాష వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. సిసిఎల్ ఎ అదనపు కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ అమరావతి సచివాలయం నుండి విసీలో పాల్గొనగా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ కలెక్టర్ తో పాటు విసీ లో పాల్గొన్నారు.