-జిల్లాలో కొత్తగా 2,280 మందికి రేషన్ కార్డులు జారీ
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హత ఉన్న ఏ ఒక్క పెన్షన్ కూడా తొలగించడం జరగదని, నోటీస్ లు ఇచ్చిన వారి పెన్షన్లు కూడా తొలగించడం జరగదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. ఈ విషయం పై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరుగు తోందన్నారు.
శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కి కార్యాచరణ, నూతన రేషన్ కార్డుల తదితర అంశాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులతో అమరావతి నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో వై.యస్.ఆర్.పెన్షన్ కానుక ద్వారా జిల్లాలో ప్రతి నెల 2,30,858 మందికి 58 కోట్ల 74 లక్షల రూపాయలు పంపిణి చేయడం జరుగుచున్నదన్నారు. డిసెంబర్ నెలకు చెందిన జనవరి 1, 2023 నుంచి కొత్తగా మరొక 9,147 మందికి పెన్షన్ కానుక ఇవ్వడం జరుగుతున్న దన్నారు. ఇందుకుగాను అదనంగా జిల్లాకు రూ.2.68 కోట్లు నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. నవరత్నాలు అమలులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వై.యస్.ఆర్.పెన్షన్ కానుక పధకం క్రింద వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకార మరియు చర్మకారుల పెన్షన్లు రూ. 2,500 నుండి రూ. 2,750 లకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని డిసెంబర్, 2022 కు సంబందించిన పెన్షన్ 1 జనవరి, 2023 నుండి పంపిణి చేయడం జరుగుతుందన్నారు. వై.యస్.ఆర్.పెన్షన్ అర్హత పరిశీలనలో భాగంగా జిల్లాలో 4,914 మందికి నోటిసులు ఇవ్వడం జరిగినదని తెలియచేశారు. నోటీస్ లు ఇచ్చిన వారి పెన్షన్లు కూడా తొలగించడం జరగదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.
నోటిసు అందిన 15 రోజులలో సంబంధిత ధృవ పత్రములను చూపి స్థానిక సచివాలయములో సమర్పించిన యెడల, అట్టి వానికి కూడా పెన్షన్ పొందుటకు అర్హులు అవుతారని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. సుభాషిణి తెలిపారు. పెన్షన్ నిలుపుదల వదంతులను నమ్మ వద్దని విజ్ఞప్తి చేశారు. పరిపాలన పరమైన విధానంలో నోటీసులు ఇవ్వటం జరిగిందన్నారు. కథనాల పై ఎటువంటి అపోహలకు లోను కావద్దని, ఏమైనా అనుమానాలు వుంటే సంబంధిత గ్రామా సచివాలయాల్లో సంప్రదించాలని ఆమె కోరడం జరిగింది.
కొత్తగా 2,280 రేషన్ కార్డులు పంపిణీ కి సిద్దం
జిల్లాలో కొత్తగా 2,280 మందికి రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని కలెక్టర్ మాధవీలత తెలిపారు. వీటిని సంబందించిన వి ఆర్ వో లాగిన్ కి అప్లోడ్ చెయ్యడం జరిగిందన్నారు. ఆయా రేషన్ కార్డులు ప్రింట్ తీసుకుని సంబంధిత సచివాలయం ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అవసరమైన ఆదేశాలను ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం ఇప్పటి వరకూ 5,61,726 మందికి రేషన్ కార్డులు ఉన్నట్లు తెలియచేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిఆర్డిఎ పిడి ఎస్. సుభాషిణి, డి ఎస్ వో పి. ప్రసాద రావు, డి ఎం (సి ఎస్) ఆర్. తనూజా తదితరులు పాల్గొన్నారు.