-పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా శిక్షణ
-రైతు ధాన్యం కొనుగోలు కు మద్దతు ధర కల్పించాలి: జే సి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్ 2022-23 సీజనుకు తిరుపతి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి మద్దతు ధరకు ధాన్యము కొనుగోలు చేయుటకు వ్యవసాయ సిబ్బందికి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అయిన పి.ఏ.సి. ఎస్ మరియు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సిబ్బందికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన శిక్షణ సందర్భంగా రైతులకు మద్దతు ధరలపై అవగాహన పోస్టర్ పాంప్లెట్ లను జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించుటకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారము ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి కే బాలాజీ మాట్లాడుతూ ఈ-క్రాప్ మరియు ఈ-కే.వై.సి ప్రాముఖ్యతను వివరిస్తూ, రైతులు దళారులని ఆశ్రయించకుండా, రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి,తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందవలసిందిగా సూచించారు. మరియు ఆర్.బి.కె లలో రైతుల వద్ద నుండి కొనుగోలుకై వి.ఏ.ఏ. లు, పీ .పీ .సీ సిబ్బంది తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. ధాన్యం కొనుగోలు లో ఏ దశ లో అయినను రైతు నష్టపోకుండా చూడాలని తెలిపారు. సివిల్ సప్లైస్ మేనేజర్ సుమతి అధికారులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన క్రొత్త పాలసీలను వివరించి బహిరంగ మార్కెట్ లో అమ్మదలచిన రైతులు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ఉంటే అమ్మవచ్చని తెలిపారు.
శిక్షణా కార్యక్రమం ముగిసిన అనంతరం పౌర సరఫరాల సంస్థ జిల్లాలో రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం నాణ్యతా ప్రమాణాలు నిర్దారించుటకు అవసరమైన పరికరాలను మరియు ప్రచార సామాగ్రి ని గ్రామ వ్యవసాయ సహాయకులకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి బి.శివ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. ప్రసాద రావు, మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సురేంద్ర బాబు, ఆర్బికే సిబ్బంది, వ్యవసాయ మార్కెటింగ్ పి ఎ సి ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.