అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడంలో వారం పది రోజులు ఆలస్యమైనా పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. సాధారణంగా మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి డోసు ఏ కంపెనీ టీకా అయితే వేసుకుంటామో.. రెండో డోసు కూడా విధిగా అదే కంపెనీ టీకా వేసుకోవాల్సి ఉంటుంది. వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవద్దు. ఆ అవసరం కూడా ఉండదు. టీకా వేయించుకునే ముందు చాలా మంది కోవిడ్ పరీక్షలు చేయిస్తున్నారు. నిజానికి ఈ టెస్టులు అవసరం లేదు. ఒకవేళ కరోనా సోకినా టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. అంతేకాదు టీకాలో కోవిడ్ వైరస్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. టీకా వేయించుకున్న తర్వాత పాజిటివ్ వస్తుందని అపోహపడుతున్నారు. అది తప్పు. టీకా వేయించుకునే ముందుగానీ, తర్వాతగానీ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే పాజిటివ్ వస్తుంది. అంతేతప్ప టీకాతో రాదు. ఇమ్యునో సప్రెసెంట్స్, స్టెరాయిడ్స్, హెచ్‌ఐవీ మందులు వాడే వారు వ్యాక్సిన్ వేయించుకోకూడదు. వారు టీకా వేయించుకున్నా ఉపయోగం ఉండదు. అలర్జీల సమస్య తీవ్రంగా ఉండి స్టెరాయిడ్స్ వాడుతున్న వారు టీకా వేయించుకోకూడదు. వారు తీసుకున్నా యాంటీ బాడీస్ అభివృద్ధి చెందవు. అనివార్యమైతే తమకు మందులు సూచించిన వైద్యుడి సలహా మేరకు టీకా వేయించుకోవడం ఉత్తమం. సాధారణంగా టీకాలను ఎడమ చేతికి వేస్తుంటారు. అవసరమైతే కుడి చేతికి తీసుకున్నా ఏమీ కాదు.
– డాక్టర్ శ్రీ భూషణ్ రాజు, నిమ్స్ నెఫ్రాలజిస్ట్