-ఆక్వా రైతుల సుస్థిర అభివృద్ధి కొరకే ఆక్వా జోన్ ఏర్పాటు: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా రైతుల సుస్థిర అభివృద్ధి కొరకే ఆక్వా జోన్ ఏర్పాటు అని, ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించడం కొరకు ఆక్వా కల్చర్ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆక్వా పరిశ్రమను వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి జరుగుతోందని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన తిరుపతి నూతన జిల్లా మొదటి జిల్లా స్థాయి ఆక్వా జోన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత కమిటీ సభ్యులైన కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ, వైజాగ్ ప్రతినిధి జ్ఞానవేల్, ఎంపెడా ఎ డి అరవిక్కరసు, ఎస్వీ యూనివర్సిటీ ఆక్వా డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి నాగజ్యోతి, ప్రోగ్రెసివ్ ఫిష్ ఆక్వా రైతులు, మత్స్యశాఖ అధికారులు, ఆర్భికే మత్స్య శాఖ సిబ్బంది తో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వా కల్చర్ జోన్లను నోటిఫై చేయుటకు నిబంధనల మేరకు రెవెన్యూ విలేజ్ ల వారీగా ఆక్వా కల్చర్ సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించి వాటి జియో కోఆర్డినేట్ లు మ్యాపింగ్ చేసి వాటిని బ్రాకిష్ వాటర్ మరియు ఫ్రెష్ వాటర్ ప్రాంతాలుగా నోటిఫై చేసేలా చర్యలు ఉండాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, సిరి కల్చర్ సాగు చేస్తున్న రైతుల పొలంలో ఆక్వా సాగు కొనసాగిస్తున్న వారికి ఆటంకం కలిగించరాదని అన్నారు. 10 ఎకరాల లోపు మత్స్య మరియు ఆక్వా కల్చర్ కుంటలను APSADA ఆక్ట్ 2020 కింద రిజిస్టర్ అయి నిర్వహిస్తున్న రైతులకు సబ్సిడీతో యూనిట్ కి రూ.1.50, 10 ఎకరాల పైన వాటికి రూ.3.85 ఒక యూనిట్ కి వసూలుకి నిబంధనల మేరకు చర్యలు ఉండాలి అని సూచించారు .
ఆక్వా కల్చర్ జోన్లుగా ప్రకటించుటకు చేపట్టిన చర్యలపై కలెక్టర్ సమీక్షించగా
జిల్లా మత్స్య శాఖ అధికారి చాంద్ భాషా కమిటీకి వివరిస్తూ ఆక్వా సాగు చేస్తున్న ప్రాంతాలు జిల్లాలో చిట్టమూరు, చిల్లకూరు, వాకాడు, కోట మండలాలలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల మేరకు సర్వే చేశామని తెలిపారు. ఈ మండలాలలో ఆక్వా సాగు 2019 నాటికి 2381.67 హెక్టర్లు ఉండగా, రీసర్వే లో 27 రెవెన్యూ గ్రామాలకు చెందిన అదనపు 782.39 హెక్టార్ల ఆక్వా సాగు గుర్తించామని వాటిని ఆక్వా కల్చర్ జోన్ గా ప్రకటించుటకు మత్స్యశాఖ వారి జి. ఓ నం.16, 2018 సం. నిబంధనలకు లోబడి ప్రతిపాదనలు కమిటీ ముందుంచగా జిల్లా కమిటీ ఆమోదించి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి కమిటీకి సిఫార్సు చేశారు.