-గృహ ఆధారిత విద్యా భత్యం కింద రూ. 1, 66, 77,000
-రవాణా భ్యతం కింద రూ. 3,63,18,000
-రూ 2 వేలు చొప్పున దివ్యాంగ బాలికలకు ఉపకార వేతనం
-ఉత్తర్వులు జారీ చేసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగ పిల్లలకు విద్యను అందించేందుకు సమగ్ర శిక్షా ‘సహిత విద్య’ (ఇన్ క్లూజీవ్ ఎడ్యుకేషన్) కృషి చేస్తుందని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అన్నారు. ఈ దిశగా ప్రత్యేక అవసరాల పిల్లలకు 2022-23 విద్యా సంవత్సరానికిగానూ గృహ ఆధారిత విద్యా భత్యం, రవాణా భత్యం కింద నిధులు విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
గృహ ఆధారిత విద్యా భత్యం రూ. 1, 66, 77,000
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 8వ తరగతి చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల (దివ్యాంగ) విద్యార్థులకు గృహ ఆధారిత విద్యా భత్యం (హోం బేస్డ్ ఎడ్యుకేషన్) కింద రూ. 1,66, 77,000 లను విడుదల చేస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నగదు DBT (Direct Beneft Transfer) మోడ్ ద్వారా నేరుగా విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. చైల్డ్ ఇన్ఫో లో నమోదై, గృహాధారిత విద్య పొందుతున్న ప్రతి విద్యార్థికి రూ. 3000 చొప్పున నగదు తమ ఖాతాల్లో జమ అవుతుందని, తద్వారా రాష్ట్రంలోని 5559 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
తీవ్ర, అతి తీవ్ర మేధా వైకల్యం కలిగి పాఠశాలలకు వెళ్లలేని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, కండరాల కదలికలు సమన్వయం లేని పిల్లలు, బుద్ధిమాంద్యత కలిగిన పిల్లల వద్దకు సహిత విద్యా వనరుల ఉపాధ్యాయులు వెళ్లి ఇంటి వద్దనే విద్యను అందిస్తున్నారు. ఈ పిల్లలకు నెలకు రూ.300 చొప్పున 10 నెలకు 3000 రూపాయలు విద్యార్థుల లేదా తల్లిదండ్రుల బ్యాంకుఖాతాలో నేరుగా జమచేయడం జరుగుతుంది.
రవాణా భత్యం రూ. 3,63,18,000
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రాథమిక, మాధ్యమిక స్థాయి ప్రత్యేక అవసరాల విద్యార్థులకు రవాణా భత్యం అలవెన్సు కింద రూ. 3,63,18,000 విడుదల చేశారు. ఇందులో ప్రాథమిక స్థాయికి రూ. 2,96,58,000, సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయికి రూ. 66,60,000 నగదు నేరుగా విద్యార్థుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. ఎలిమెంటరీ స్థాయి విద్యార్థులు 9886 మంది, మాధ్యమిక స్థాయి విద్యార్థులు 2220 మంది లబ్ధి పొందనున్నారని తెలిపారు.
సుదూర ప్రాంతాల నుండి పాఠశాల రావడానికి ఇబ్బంది పడుతున్న దివ్యాంగులకు ఆర్థికంగా వారిని ప్రోత్సహించేందుకు, వారి హాజరును పెంచేందుకు, రవాణా భత్యాన్ని దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల నమోదై భవిత కేంద్రంలో 1 నుండి 10 తరగతుల మేధో వైకల్యం, వినికిడి లోపం, ఆటిజమ్ దివ్యాంగ బాల బాలికల హాజరు శాతాన్ని పరిగణించి నెలకు 300 రూపాయలను నేరుగా దివ్యాంగ బాలబాలికల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో గరిష్టంగా 10 నెలలకు రూ. 3000 జమ చేయబడుతుంది.
దివ్యాంగ బాలిలకలకు రూ. 2 వేలు ఉపకారవేతనం
ఒకటి నుండి పదో తరగతి చదువుతన్న దివ్యాంగ బాలికలకు ఉపకార వేతనం కింద రూ. 2000 చొప్పున ప్రాథమిక 13955 మంది ప్రాథమిక స్థాయి బాలికలకు, 4738 మంది మాధ్యమిక స్థాయి బాలికలకు రూ. 3,73,86,000 లను ఈ నెల 23న విడుదల చేసినట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు.