Breaking News

ఉగాది లోపు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలి !!

-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇప్పటి వరకు 12 వేలకు పైగా గృహాలు పూర్తయ్యాయని, వచ్చే నెల 22 వ తేదీ ( ఉగాది ) లోపు జిల్లా వ్యాప్తంగా 4,800 ఇళ్ళు పూర్తి చేసి నిర్దేశించిన మొదటి లక్ష్యం 16,877 ఇళ్ళు పూర్తి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, డ్వామా, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.వి. సూర్య నారాయణతో కలిసి జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లే అవుట్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వారం వారం లక్ష్యాలను నిర్ణయించుకుని ఆ మేరకు పూర్తి చేయాలని సూచించారు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల నుంచి హౌసింగ్‌ అధికారుల వరకు అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పామర్రు మండలం ఎంపీడీవో తో వీడియో కాన్ఫరెన్స్ లో సంభాషిస్తూ ఉండగా, మీ వెనక కూర్చుని అదేపనిగా ఫోను మాట్లాడుతున్న వ్యక్తి ఎవరని ప్రశ్నించారు. మా ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సార్ అని ఎంపీడీవో సమాధానం ఇవ్వగా, వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అతనికేమి పని అని అడిగారు. జిల్లా అధికారులు పాల్గొంటున్న వీసీలో ఆ వ్యక్తిని ఎందుకు అనుమతించారని అలాగే విసి జరుగుతున్నపుడు ఫోన్ మాట్లాడుతున్నందుకు ఆ వ్యక్తిపై రిపోర్ట్ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు
జిల్లాలో కొన్ని మండలాల్లో గృహ నిర్మాణాలు ప్రగతి తక్కువగా ఉందని వచ్చే 20 రోజులలో గృహనిర్మాణాలలో పురోగతి తీసుకురాకపోతే సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలకు వెనుకాడబోమన్నారు.
జిల్లాలోని వివిధ జగనన్న లేఔట్లలో ఉగాది నాటికి కేటాయించిన 16,890 ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని హౌసింగ్ డీఈలు ఎంపీడీవోలు,మండల తాహసిల్దారులు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలన్న లక్ష్యాన్ని ఏర్పరిచిందని వాటిని జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్లను బేస్మెంట్ స్థాయికి, బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్లను రూఫ్ స్థాయికి, రూఫ్ స్థాయిలో ఉన్న ఇల్లు పూర్తి స్థాయి దశలో స్టేజ్ కన్వర్షన్ కు తీసుకువచ్చి బిల్లులు అప్లోడ్ చేయాలన్నారు. వివిధ మండలాల్లో షిఫ్టింగ్ పోల్స్, నీటి వసతి తదితర అంశాలలో ఎంపీడీవోలు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. స్థానిక సమస్యలు ఏవైనా ఉంటే సంబంధిత ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్ని మండలాల్లో పెండింగ్ లో ఉన్న ఆదాయ, కుల ధ్రువీకరణ సర్వేను వేగవంతం చేసి త్వరితగతను పూర్తి చేయాలని మండల తాసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి శాఖ వేగవంతంగా తనదైన శైలిలో పనిచేసి అభివృద్ధి గమ్యాలను చేరుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించడం, అంగన్వాడీ కేంద్రాల్లో బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి ఎదుగుదలకు పటిష్ట ప్రణాళిక రూపొందించి ఆ మేరకు అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
హైరిస్క్ గర్భిణీ స్త్రీలు, బాలింతల్లో రక్తహీనతను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
రెండవ విడత మనబడి నాడు నేడు కింద చేపట్టిన పనులు వేగవంతం చేసి పాఠశాలల సుందరీకరణ, మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు. ఖర్చు చేయని నిధులకు సంబంధించి…పూర్తయిన పనులకు వెంటనే బిల్లులు అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బడి బయట ఉన్న విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, సాధికారిక అధికారిణి కె. సరస్వతి, మెప్మా,, డిఆర్ డిఏ పిడి పిఎస్ ప్రసాద్, డిపిఓ నాగేశ్వరరావు, ఏడి సర్వే ఎస్ గోపాల్ రాజ్ , ఐసిడిఎస్ పిడి ఎస్.సువర్ణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం పని ధూర్జటి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *