-స్వేచ్ఛాయిత ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల యంత్రాంగం సన్నద్ధం కావాలి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయుల మరియు పట్టభద్రుల నియోజక వర్గాల ఎం ఎల్ సి ఎన్నికలు సజావుగా , ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని, అత్యంత ప్రణాళిక బద్ధంగా బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే వెంకట రమణ రెడ్డి అన్నారు.
సోమవారం ఉదయం కలెక్టర్ ఎస్పీ పరమేశ్వర రెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు డి ఆర్ ఓ శ్రీనివాస రావు తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అదనపు ఎస్పీలు, ఆర్డీఓ లు, డిఎస్పీ లు, తాసిల్డార్లతో సమావేశమై ఎంఎల్ సి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష చేస్తూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో అధికారులు భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు మేరకు పనిచేయాల్సి ఉంటుందని కమిషన్ జారీ చేసిన నిబంధనలపై చక్కటి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు.
ప్రకాశం- నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల నియోజక వర్గ ఎంఎల్ సి కు సంబంధించి అనుబంధ పోలింగ్ కేంద్రాలతో కలిపి 101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 23 న ప్రచురించిన ఓటర్ల జాబితా మేరకు 86941 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 53435 మంది, మహిళలు 33494, ఇతరులు 12 మంది ఓటర్లు ఉన్నారని, ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయ నియోజక వర్గాల కు సంబంధించి 37 పోలింగ్ కేంద్రాల ఓటర్లు 6132 ఉన్నారని అందులో పురుషులు 3604, మహిళలు 2528 ఉన్నారని తెలిపారు.
పోలింగ్ సిబ్బందికి శిక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు 7 ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లు ఏర్పాటు చేసి పర్యవేక్షణకు చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లో పరిధిలో 23 సెక్టార్లు ఏర్పాటు చేసి రూట్ ఆఫీసర్లను నియమించి 138 పోలింగ్ కేంద్రాలకు అనుసంధానం చేశామని అన్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి 15 మంది నోడల్ అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పోలీస్ రెవెన్యూ అధికారులు సమన్వయంతో పోలింగ్ కేంద్రాలలో ఉన్న వాస్తవిక పరిస్థితులు గమనించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సమస్యలు లేని పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి అనుగుణంగా బందోబస్తు ప్రణాళిక చాలా పటిష్టంగా ఏర్పాటు కావాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఒక హెడ్ కానిస్టేబుల్, 4 కానిస్టేబుల్ లు, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 12 మందితో కూడిన ఒక సెక్షన్ సాయుధ బలగాలు, ఏ ఎస్పీ,హెచ్ సి, కానిస్టేబుల్ తో పాటు స్థానిక పోలీస్ టీమ్ లు ఎస్ఐ పిసి లతో కూడిన బలగాలు ఏర్పాటు నిబంధనల మేరకు ఏర్పాటు కావాలని సూచించారు. అలాగే తిరుపతి డివిజన్ నందు 23 పోలింగ్ స్థానాలు గూడూరు డివిజన్ నందు 9 పోలింగ్ స్థానాలు శ్రీకాళహస్తి డివిజన్ నందు 10 పోలింగ్ స్థానాలు సూళ్లూరుపేట డివిజన్ 9 పోలింగ్ స్థానాలలో గల పోలింగ్ కేంద్రాలలో అలాంటి కేంద్రాలను గుర్తించి న మేరకు ప్రణాళికల తయారీ మరియు బలగాల మోహరింపు కు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.
అతి ముఖ్యమైన అంశం గా ఓటర్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమంటే పోలింగ్ కేంద్రంలో ఓటర్ స్లిప్ మరియు అందుకు సంబంధించిన ఓటర్ ఋజు పత్రం మాత్రమే అనుమతి చేయబడుతుందని, పెన్నులు, పెన్సిల్, పేపర్లు, సెల్ ఫోన్లు తదితరములు అనుమతి లేదని తదనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బ్యారికేడింగ్ నిబంధనల మేరకు ఏర్పాటు ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వారీగా తగినన్ని మార్క్డ్ ఓటర్ల జాబితా వర్కింగ్ ఓటర్ జాబితాలు అందుబాటులో ఉంచుకోవాలని, బి ఎల్ ఓ లు ఓటర్ల స్లిప్పులు సదరు ఓటరుకు అందేలా చూడాలని దానికి అనుగుణంగా సంబంధిత బి ఎల్ ఓ లకు ఉత్తర్వులు తాశిల్డార్లు జారీ చేసి బాధ్యతలు కేటాయించాలని అన్నారు.
ఎస్పీ వివరిస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని 23 రూట్లకు గాను 31 మొబైల్ టీంలు ఏర్పాటు చేస్తున్నామని, 24 స్ట్రైకింగ్ బలగాలు, 7 ప్రత్యేక స్ట్రైకింగ్ బలగాలు, 4 స్వాట్ టీమ్ లు ఏర్పాటు, తగినన్ని క్యూ ఆర్టి ల ఏర్పాటు, బ్యాలెట్ రవాణా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయిలో బందోబస్తు ప్రణాళిక రెండు రోజుల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు కనక నరసారెడ్డి రామారావు చంద్రముని రనాల్ కిరణ్ కుమార్ అదనపు ఎస్పీలు కులశేఖర్, వెంకటరావు, చెన్నయ్య, తదితర రెవెన్యూ పోలీసు అధికారులు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.