-ఈ ఉష్ణోగ్రత వద్దే సెట్ చేసుకొని.. ఏసీలు వాడుకోండి
-దీనివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లబ్ధి
-కరెంటు బిల్లులు, కర్బన ఉద్గారాలూ తగ్గుతాయి
-స్టార్ రేటెడ్ గృహోపకరణాల వినియోగంతో భారీ ప్రయోజనాలు
-గృహ వినియోగదారులకు ఏపీఎస్ఈసీఎం సూచన
-స్టార్ రేటెడ్ ఉపకరణాల వినియోగం, ఏసీలు 26 డిగ్రీల వద్ద నడపడంపై విస్తృత అవగాహన కల్పించండి
-ఏపీఎస్ఈసీఎం అధికారులకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఆదేశం
-0 స్టార్ ఏసీతో పోల్చితే 5 స్టార్ ఏసీ వల్ల ఏడాదికి రూ.2500 ఆదా
-26 డిగ్రీల వద్ద నడిపితే ఒక్కో ఏసీతో ఒక్కో రాత్రికి 5 యూనిట్లు పొదుపు
-ప్రస్తుతం దేశంలో ఏసీ సామర్థ్యం 80 టీఆర్.. పదేళ్లలో 250 టీఆర్ కు పెరిగే అవకాశం: బీఈఈ
-ఏసీ రోజుకు 8-10 గంటలు నడిస్తే 10 కేజీల కార్బన్ డయాక్సైడ్ విడుదల!
-స్టార్ రేటెడ్ ఉపకరణాల వినియోగానికి ప్రచార వ్యూహం సిద్ధం చేయండి
-ఏపీఎస్ఈసీఎం అధికారులకు ఇంధన కార్యదర్శి ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
మండే ఎండలు.. భరించలేని ఉక్కపోత.. మరోవైపు కరోనా మహమ్మారి.. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని ప్రభుత్వ సూచన.. ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులంతా ఇళ్లలోనే ఉంటున్నారు. భానుడి ప్రతాపాన్ని తట్టుకోవాలంటే ఏసీ ఆన్ చేయాల్సిందే! మరి పగలు, రాత్రి తేడా లేకుండా ఏసీ వేసుకుంటే కరెంటు బిల్లు ఎంత వస్తుందోనన్న భయం.. అదేపనిగా ఏసీ గదుల్లో ఎక్కువ చల్లదనంలో ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదేమోనన్న ఆందోళన! రాష్ట్రంలో ఇదీ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏసీ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం)’ నడుం బిగించింది. ఎయిర్ కండిషనర్లు 26 డిగ్రీల్లో పెట్టుకుంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేలని చెబుతోంది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, వేసవి తాపంతో ఇళ్లలో ఏసీల వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పర్యావరణంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏపీఎస్ఈసీఎం నడుం బిగించింది. ఏసీలను 26 డిగ్రీల్లో ఉంచి వాడుకోవడం ద్వారా ఆర్థికంగానూ, ఆరోగ్య పరంగానూ లబ్ధి చేకూరుతుందని పేర్కొంటోంది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో ఏసీల వార్షిక విద్యుత్తు డిమాండ్ 2800 మిలియన్ యూనిట్లు. ఈ నేపథ్యంలో ఏసీల ఉష్ణోగ్రతలను 26 డిగ్రీల వద్ద సెట్ చేసుకోవాలని ఏపీఎస్ఈసీఎం ప్రజలకు సూచిస్తోంది. ఫలితంగా తక్కువ విద్యుత్తు వినియోగమవుతుంది. ప్రస్తుత కరోనా కష్ట కాలంలో ఆరోగ్యంపైనా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయంటోంది. గదిలో ఏసీ ఉష్ణోగ్రతలు 19 నుంచి 21 డిగ్రీల వద్ద ఉంటే.. అవి సాధారణ శరీర ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువని, తద్వారా అల్పోష్ణ స్థితి, ఆర్థరైటిస్, చర్మ అలర్జీలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తేందుకు అవకాశముందని పేర్కొంది. ఏసీలు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నడుస్తున్నప్పుడు కంప్రెషర్ నిరంతరాయంగా పనిచేయాలని, అందుకు అధిక విద్యుత్తు అవసరమవుతుందని.. ఫలితంగా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏసీలను ఎప్పుడూ 26, ఆ పైన ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం, ఫ్యాన్ స్పీడును తక్కువగా ఉంచడం ఉత్తమమని.. తద్వారా తక్కువ కరెంటు అవసరమవుతుందని స్పష్టం చేస్తున్నారు. 26 డిగ్రీల మీద నడపడం ద్వారా ఒక్కో ఏసీకి ఒక్క రాత్రికి కనీసం 5 యూనిట్లు ఆదా చేస్తే.. 10 లక్షల ఇళ్లలో రోజుకు 5 మిలియన్ యూనిట్లు పొదుపు చేయొచ్చని అంచనా. దీనివల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ఏసీల కొనుగోళ్లూ పెరుగుతున్నాయి. 0 స్టార్ ఏసీతో పోల్చితే 5 స్టార్ ఏసీ వినియోగం వల్ల రోజుకు 4.5 యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుంది. 0 స్టార్ ఏసీతో పోల్చి చూసినప్పుడు, 1 స్టార్ స్ప్లిట్ ఏసీ (1.5 టన్)తో ఏడాదికి రూ.665 ఆదా అయితే.. 5 స్టార్ ఏసీతో రూ.2500 వరకు పొదుపు చేయొచ్చు. ఇళ్లలో స్టార్ రేటెడ్ విద్యుత్తు ఉపకరణాల వినియోగం, కరెంటు బిల్లులపై వాటి ప్రభావం అనే అంశంపై రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి ఏపీఎస్ఈసీఎం అధికారులతో ప్రత్యేకంగా ఆన్లైన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసీ ఉష్ణోగ్రతల సెట్టింగుల్లో 1 డిగ్రీ తగ్గితే, విద్యుత్తు వినియోగం 6 శాతం తగ్గుతుందని చెప్పారు. కేంద్ర విద్యుత్తు శాఖ సూచన మేరకు స్టార్ రేటెడ్ ఏసీలను కొనేలా, 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో నడిపేలా వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
‘‘చాలా మంది ప్రజలు ఏసీలను 20-22 డిగ్రీల వద్ద పెట్టుకొంటారు. చలిగా అనిపిస్తే దుప్పట్లు కప్పుకొంటారు. ఇది రెండు రకాల (విద్యుత్తు, ఆరోగ్యం) అనర్థాలకు కారణమవుతుంది. మనిషి శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్. మన శరీరం 23 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి అవకాశముంది. గది ఉష్ణోగ్రతలు ఇంతకంటే తక్కువ లేదా ఎక్కువగా ఉన్నప్పుడు తుమ్ములు, వణుకు వంటి సమస్యలు వస్తాయి. దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 మహమ్మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఏసి ను 26 డిగ్రీలలో పెట్టడం ద్వారా ఈ సమస్యల నుంచి అధిగమించటానికి అవకాశముంటుందని ఇంధన కార్యదర్శి తెలిపారు. దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులందరూ ఏసీలను 26 డిగ్రీల వద్దే నడపాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ అధికారులు ఏపీఎస్ఈసీఎంకు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఇంధన సామర్థ్య, ఆరోగ్యకమైన అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించింది. దేశంలో ప్రస్తుతం మొత్తం ఏసీల స్థాపిత సామర్థ్యం 80 మిలియన్ టీఆర్(టన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్) (74,234 మెగావాట్లు). పదేళ్లలోపే ఇది 250 మిలియన్ టీఆర్ (2,31,982 మెగావాట్లు)కు పెరుగుతుందని.. ఫలితంగా దేశంలో ఏసీల వల్లే కనెక్టెడ్ లోడ్ 200 గిగావాట్లకు (2030 కల్లా) పెరుగుతుందని అంచనా. అంటే ఇది అత్యధిక పెరుగుదల అన్నమాట. ఇది వాతావరణ మార్పులకు ప్రధాన కారణమవుతుంది. ఒక్కో ఏసీ రోజుకు 8-10 గంటలు నడిస్తే రోజుకు 10 కేజీల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. ఏసీలను 26 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నడపడం వల్ల ప్రజలకు, పర్యావరణానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని, దీనిని ప్రజలొక్కి విస్తృతంగా తీసుకువెళ్లాలన్న రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ప్రతిపాదనను ఆయన అభినందించారు. స్టార్ రేటెడ్ ఉపకరణాల వినియోగం ప్రత్యేకించి ఏసీల వినియోగానికి సంబంధించి ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేయాలని ఇంధన కార్యదర్శి ఏపీఎస్ఈసీఎం అధికారులను ఆదేశించారు. ‘‘మనం ఇప్పటికే అనేక ఇంధన సామర్థ్య, పరిరక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఎల్ఈడీ వీధి దీపాలు, బీఈఈ ఆధ్వర్యంలో స్టార్ రేటెడ్ ఎలక్ట్రిక్ ఉపకరణాలను సరఫరా చేయడం, రైతులకు ఇంధన సామర్థ్య మోటార్లు అందజేయడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. అలాగే ఏసీలకు సంబంధించి కూడా ఉత్తమ ఇంధన సామర్థ్య విధానాలను అమలు చేస్తున్నాం’’ అని ఇంధన కార్యదర్శి తెలిపారు.
Tags amaravathi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …