-క్రమం తప్పకుండా సకాలంలో కమిటీ సమావేశం నిర్వహించడం అభినందనీయం: ఎంయల్సి బల్లి కళ్యాణ చక్రవర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్.సి, ఎస్.టి వర్గాల అభ్యున్నతికి, వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తుందని, ఏదైనా సమస్య ఉంటే సకాలంలో తెలిపితే తప్పక సత్వర చర్యలు చేపడతామని కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ యొక్క 2023 సం. మొదటి సమావేశం నిర్వహించగా ఎం.ఎల్.సి. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఎస్.పి. పరమేశ్వర్ రెడ్డి, డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు,ఆర్.డి.ఓ.లు కనకనరసా రెడ్డి, కిరణ్ కుమార్, రామారావు, చంద్రమునీ రనాల్, కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, కమిటీ కన్వీనర్ చెన్నయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి2023 నాటికి జిల్లాలో ఎస్.సి, ఎస్.టి లకు సంబంధించిన కేసులు 85 నమోదు అయ్యాయని, ఎఫ్.ఐ.ఆర్., చార్జి షీట్ అయిన బాదితులకు మానిటరీ రిలీఫ్ ద్వారా రూ.82.20 లక్షలు నిర్దేశించిన సమయానికి చెల్లించడం జరిగిందని వివరించారు. గత త్రైమాసికం లో డిసెంబర్ ఆఖరి వరకు 21 కేసులు నమోదు కాగా, జనవరి23 నుండి మార్చి23 వరకు 25 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ఈ మొదటి త్రైమాసికం నాటి వరకు 67 కేసులు పరిశోధన దశలో పురోగతిలో ఉన్నాయని అన్నారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు ఎంతో ఫలవంతంగా జరగడానికి సహకరిస్తున్న కమిటీ సభ్యులందరికీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
ఎం ఎల్ సి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ క్రమం తప్పకుండా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని సమీక్షించుకోవడం ద్వారా సంబంధిత సమస్యలు పరిష్కారం సత్వరమే జరిగే అవకాశాలు ఉన్నాయని, మన జిల్లాలో క్రమం తప్పకుండా ఈ సమావేశం జరగడానికి చొరవ తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసుల నమోదులో జాప్యం లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నా కేసుల ట్రయల్ చిత్తూరు జిల్లాలోని కోర్టులో జడ్జి పరిధిలో ఉందని, దీనికి రెగ్యులర్ జడ్జి లేకపోవడం వలన ముద్దాయిలకు చట్టపరంగా శిక్షలు పడడంలో కానీ, తీర్పుల లో జాప్యం కలుగుతోందని అన్నారు. ఏదైనా సమస్యలు గుర్తించిన వెంటనే పై అధికారులకు గానీ, తనకు నేరుగా సమాచారం ఇవ్వాలని సభ్యులకు సూచించారు.
కమిటీ సభ్యులు మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో ఇంకా హరిజనవాడలు ఉన్నాయని వాటి పేరు మార్పుకు చర్యలు తీసుకోవాలని కోరగా కలెక్టర్ స్పందిస్తూ డిపిఓ వారు గ్రామాల్లో గ్రామసభ తీర్మానం చేసి పంపాలని గెజిట్ వెలువడిన తర్వాత పేరు మార్పు జరుగుతుందని తెలిపారు. సదరు ఆదేశాలు డిపిఓ నుండి పంచాయితీ కార్యదర్శులకు అందాయని, వారు సత్వరమే చర్యలు గైకొనేల పర్యవేక్షిస్తామని తెలిపారు. అలాగే సభ్యులు వారి దృష్టికి వచ్చిన భూములకు సంబంధించిన, స్మశాన వాటికలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంశాలపై కమిటీ దృష్టికి తెచ్చారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ దిశా చట్టం పకడ్బందీగా అమలు, కేసులపై కఠినంగా చర్యలు చేపట్టాలని కోరారు. స్పందించిన కలెక్టర్ తప్పక వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమావేశ ప్రారంభంలో కన్వీనర్ చెన్నయ్య గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు.
ఈ కమిటీ సమావేశంలో అధికారిక సభ్యులుగా ఉన్న జిల్లా ఆడిట్ అధికారి జయపాల్, జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ సుమతి, శ్రీనివాస నాయక్, సభ్యులు ప్రసాద్ బాబు,వెంకట రమణ, మహేష్, సురేష్ బాబు, ఎన్.జి.ఓ మెంబర్లు రోప్ సంస్థ మునిచంద్రారెడ్డి, ప్రగతి వెంకటరమణ, ఎబిఎంఎం వెంకటాచలం, పోలీసు అధికారులు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.