తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన , ప్రధాన మంత్రి జీవన జ్యోతి గురించి జిల్లాలో గ్రామ పంచాయతి స్థాయిలో ఏప్రిల్ 4 నుంచి జూన్ 30 వరకు జరుతున్న కార్యక్రమాన్ని అవగాహన , ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి అన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో భారత ప్రభుత్వం ఆర్థిక శాఖ, ఆర్థిక సేవల విభాగము వారి ఆదేశానుసారం జిల్లాలో గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం (డి సి సి) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకాల పై అవగాహన కలిగేలా ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని తెలిపారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకము సంబంధించి 18 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి ప్రతి సంవత్సరము రూ.436 లతో ఆటో డెబిట్ ద్వారా రెండు లక్షల రూపాయల బీమా వర్తించును. బీమా సంవత్సరం కాల పరిమితి ఏటా జూన్ ఒకటవ తేదీ నుండి మే 31 తేదీ వరకు కలదని, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సంబంధించి 18 నుండి 70 సం.లు కలిగిన వారికి ప్రతి సంవత్సరము రూ. 20 లతో రెండు లక్షల వరకు ప్రమాద బీమా వర్తించునని వివరించారు. కావున గ్రామ సచివాలయంలోని వాలంటీర్లతో హ్యాబిటేషన్ వారీగా ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి గురించి అవగాహన కల్పించి ఎన్రోల్మెంట్ చేయించేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వాలంటీర్లు ఆసక్తి కల ప్రజలను ఎన్రోల్మెంట్ చేసే ముందు లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నెంబరు, ఆధార్ నెంబర్, నామినీ వివరాలతో అప్లికేషన్స్ పూర్తి చేసేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను, లబ్ధి పొందిన లబ్ధిదారుల విజయగాదలను ప్రజలకు తెలియజేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పథకములకు సంబంధించిన సమాచారం గురించి పోస్టర్స్ అతికించడం, దండోరా వేయించడం వంటి కార్యక్రమాలు సంబంధిత అధికారులు చేపట్టవలసి ఉంటుందని తెలిపారు.
లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధాన మంత్రి జీవనజ్యోతి పథకాలను గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామస్థాయి లో బ్యాంకర్లు, లైన్ డిపార్ట్మెంట్ వారందరి సహకారంతో అమలు అయ్యేలా కృషిచేయాలని తెలిపారు.
నాబార్డ్ ఏజీఎం సునీల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి వంటి పథకాలు గురించి ఫైనాన్షియల్ లిటరసీ శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కుటుంబంలోని మొత్తం సభ్యులందరూ ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం కలదు అని తెలిపారు. ఈ పథకాల గురించే కాకుండా సబ్సిడీ అందించే పథకాల గురించి కూడా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగిన సరస్ 2022-23 డ్వాక్రా ప్రదర్శనను బాధ్యతగా తీసుకొని విజయవంతంగా చేసిన సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జయకుమార్ , ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ అరుణ, ఆంద్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శైలేంద్ర, నాబార్డ్ ఏజీఎం సునీల్, డి ఆర్ డి ఎ పిడి జ్యోతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామి రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ, ప్రవేట్ బ్యాంక్ ల ప్రతినిధులు , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.