-ఇఫ్తార్ విందులు సర్వ మత సామరస్యాన్ని పరిమళింపజేస్తాయి: ఎమ్మెల్యే భూమన
-రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది: ఎంపీ గురుమూర్తి
-సహృధ్భావ వాతావరణంలో రంజాన్ పండుగ ముస్లిం సోదరులు జరుపుకుంటారు: ఎంఏల్సి
-మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎంపీ డా. గురుమూర్తి, ఎంఏల్సి సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి నగర మేయర్ డా. శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ పాల్గొని రంజాన్ పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
బుధవారం సాయంత్రం తిరుపతి నగరంలోని షాదీ మహల్ నందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇఫ్తార్’ విందు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులు.. ప్రజల మధ్య సోదరభావం, ఆత్మీయ సహృద్భావాలను మతసామరస్యాన్ని పరిమళింపజేస్తాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం తిరుపతి నగరంలో ఇఫ్తార్ విందు జరగడం ఎంతో సంతోష దాయకం అని ముస్లిం సోదరులు అందరికీ ఆ అల్లా ఆశీసులతో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు అందరికీ శుభాకాంక్షలు అని తెలుపుతూ, ఇస్లాం అంటేనే మనకు మనం సమర్పించుకోవడం, మహమ్మద్ ప్రవక్త శాంతి కాముకుడు అని, దైవ దూత అని అన్నారు. ఇస్లాం ఎంతో ఉన్నతమైన ఆశయం కలిగి హింసకి వ్యతిరేకంగా శాంతి కాముకులుగా ఉన్న తిరుపతి జిల్లా ముస్లిం సోదరులను గంగమ్మ జాతర కు ఆహ్వానిస్తున్నాను అని మత సామరస్యానికి ప్రతీకగా అందరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ, ఎంఏల్సి సిపాయి సుబ్రమణ్యం, మేయర్ శిరీష మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో విశ్వశాంతికి ఆ అల్లాహ్ ను పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రార్థిస్తూ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్య కార్యమని అభినందనీయం అన్నారు. కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా ఉండాలని అన్నారు. పవిత్ర దైవారాధనకు, ధార్మిక చింతనకు, దైవభక్తికి క్రమశిక్షణకు, దాతృత్వానికి రంజాన్ మాసం ఉత్తమమైనది అన్నారు. మనిషి సత్ప్రవర్తనలో నడవడానికి.. రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తాయన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, ఎస్డిసి భాస్కర్ నాయుడు, జిల్లా మైనారిటీ అధికారి చిన్నా రెడ్డి, వక్ఫ్ బోర్డు సిబ్బంది, ముస్లిం సోదరులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం ప్రముఖులు,తదితరులు పాల్గొన్నారు.