-ప్రభుత్వ పథకాలను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికల అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్
-ప్రజా సేవలను క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి రూరల్ పరిధిలోని వెంకటపతి నగర్ విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రాన్ని మరియు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సందర్శించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలపై, అసంక్రమిత, సంక్రమిత వ్యాధుల ఫాలోఅప్, అంగన్వాడి సేవలు, రక్తహీనత, గర్భిణీ స్త్రీల, క్యాన్సర్ పేషంట్ల ఫాలో అప్ పై సమీక్షించి, మంచానికే పరిమితమైన రోగుల గృహ సందర్శన చేసి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
శనివారం ఉదయం తిరుపతి రూరల్ వెంకటపతి నగర్ లోని విలేజ్ హెల్త్ క్లినిక్ ను ముందుగా కలెక్టర్ సందర్శించి వాటి పరిధిలోని గర్భిణీ స్త్రీలు, కౌమార దశలోని అమ్మాయిలు అనీమియాతో బాధపడుతున్న వారి వివరాలు ఏఎన్ఎం ను అడిగి తెలుసుకుని వారికి ఐరన్ ఫోలిక్ టాబ్లెట్లు అందుతున్నాయా అని, గృహ సందర్శనలు చేస్తున్నారా లేదా అని, వారంలో జరగబోవు కాన్పుల వివరాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీసి క్రమం తప్పకుండా రక్తహీనత ఉన్న వారికి పరీక్షలు చేసి మందులు అందజేయడం, కౌన్సిలింగ్ నిర్వహించడం, ఫాలో అప్ తో మంచి ఫలితాలు వచ్చే దిశలో పనితీరు ఉండాలని అన్నారు. అలాగే అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీల తో కలెక్టర్ మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటే వారికి పుట్టబోవు పిల్లలు ఆరోగ్యంగా పుడతారని, ప్రభుత్వం నుండి అందిస్తున్న వైయస్సార్ సంపూర్ణ పోషణ, ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను సద్వినియోగం చేసుకొని, ఆస్పత్రులలో సురక్షిత కాన్పులు జరిగేలా ఉండాలని తెలిపారు. ఏఎన్ఎం వివరిస్తూ క్లినిక్ పరిధిలో 29 మంది బాలింతలు ఉన్నారని అందులో 19 మంది మద్యస్థ రక్తహీనతతో బాధపడుతున్నారని వారికి క్రమం తప్పకుండా పరీక్షలు చేసి ఐ ఎఫ్ ఏ మందులు అందిస్తున్నామని తెలిపారు.
అనంతరం పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి అందులోని పిల్లలతో ముచ్చటించి వారికి చిక్కిలు, గుడ్లు,పాలు వంటి పౌష్టికాహారం అందుతోందా అని అడిగి తెలుసుకుని అందులోని బరువు తక్కువ కల 12 మంది పిల్లలలో ఒకరి బరువును స్వయంగా పరిశీలించి బరువు తక్కువ గల అలాంటి పిల్లలకు చిక్కీ, గుడ్లు,పాలు నెయ్యి/ నూనె వంటి పోషక విలువలు కల పదార్థాలలో ప్రభుత్వం అందించే వాటికి అదనంగా సిఎస్ఆర్ కింద దాతల నుండి సేకరించి పిల్లలను రక్తహీనత, బరువు తక్కువ, ఎత్తు తక్కువ నుండి త్వరితగతిన బయటపడేలా చేయవచ్చని, సరైన డేటా అందుబాటులో ఉంచుకుని క్రమం తప్పకుండా వారికి దాతల సహకారంతో పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్య సమస్యల నుండి పిల్లలు బయటపడతారని చదువుపై దృష్టి పెట్టగలరని మంచి భవిష్యత్తు వారికి కల్పించిన వారమవుతామని నిబద్దతతో అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి సూచించారు.
విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో సచివాలయ పరిధిలో నలుగురికి ఒకటవ తరగతిలో సీట్లు కేటాయింపు జరిగిందని సచివాలయ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ తెలుపగా ఇరువురు పిల్లలతో కలెక్టర్ మాట్లాడుతూ మంచిగా చదువుకోవాలని ఆశీర్వదించారు. గృహ సందర్శనలో మాత శిశు సంరక్షణ వివరాలను గృహిణిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గృహ సందర్శనలో బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళ ను పరామర్శించగా మహతిలో జరిగిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో తెలిపిన క్యాన్సర్ లక్షణాల ద్వారా అనుమానంతో పరీక్షించుకున్న తర్వాత క్యాన్సర్ ఉన్నట్లు ధ్రువీకరణ అయిందని స్విమ్స్ లో చికిత్స పొందుతున్నట్లు, 104 వాహనం ద్వారా డాక్టర్, ఏఎన్ఎం గృహ సందర్శన చేస్తున్నారని మహిళ తెలపగా వైద్య అధికారులకు ఏఎన్ఎం ఆశ వర్కర్లకు మాట్లాడుతూ గ్రామాలలో వారి ఆరోగ్య స్థితిగతులపై సరియైన పూర్తిస్థాయి ప్రశ్నావళితో కౌన్సిలింగ్ నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యంపై పూర్తి సమాచారంతో వారికి నిర్వహించాల్సిన పరీక్షలు మరియు కావాల్సిన మందుల పై అవగాహన వస్తుందని, దీనివలన రోగాలను ముందుగానే గుర్తించి రోగం ముదరకుండానే వారికి మందులతో నయం చేసే విధంగా వారి ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళమవుతామని ఆ దిశలో పనిచేయాలని సూచించారు.
అలాగే పక్షవాతంతో, డయాబెటిస్, రక్తపోటు వంటి వ్యాధితో బాధపడుతున్న వారి గృహ సందర్శన చేసి 104 సేవలు వినియోగంపై ఆరా తీసారు. అలాగే హౌసింగ్ కు సంబంధించి తొండవాడ లేఔట్ లబ్ధిదారులతో ఇంటి పురోగతిపై ఆరా తీయగా వారు ఇంటి నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామంలో పారిశుధ్యాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ తనిఖీల్లో భాగంగా తిరుపతి రూరల్ వెంకటపతి నగర్ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం ప్రారంభానికి అన్ని విధాల సిద్ధంగా ఉందని సర్పంచ్ సుబ్రహ్మణ్య యాదవ్ కలెక్టర్ కు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీహరి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి, డి ఎల్ డి ఓ లు సుశీల దేవి, ఆదిశేష రెడ్డి, అదనపు సిడిపిఓ జ్యోతి తిరుపతి రూరల్ తాసిల్దార్ ఎంపీడీవో తదితర అధికారులు పాల్గొన్నారు.