-బాల కార్మిక వ్యవస్థ లేని సమాజ నిర్మాణానికి అందరం కలసి కట్టుగా కృషి చేయాలి
-బాలల హక్కులను బాల్యాన్ని కాపాడటం మన అందరి బాధ్యత: ఎన్సీపీ సీఆర్ సభ్యులు ఆనంద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలు వీధుల వెంబడి తిండి కొరకు అడుక్కునే పరిస్థితి లేకుండా వారు బాల్యాన్ని స్వేచ్ఛగా అనుభవించే విధంగా వాతావరణం కల్పించుటకు, బాలల హక్కులను కాపాడడం కొరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎల్లవేళలా ముందుంటుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్ జి ఆనంద్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక అలిపిరి పోలీస్ స్టేషన్ సవీపంలోని అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు మాట్లాడుతూ భారత దేశంలో ముఖ్యంగా 51 నోడల్ ప్రాంతాలలో ప్రత్యేకించి పుణ్యక్షేత్రాలు గల ప్రాంతాల లో చిన్నపిల్లలు అడుక్కోవడం, బాల కార్మిక వ్యవస్థ ఉన్నట్లు ఎన్సిపిసిఆర్ సర్వే లో గుర్తించడం జరిగిందని, అందులో భాగంగా సంబంధిత పుణ్యక్షేత్రాల అధికారులతో, జిల్లా యంత్రాంగంతో సదరు అంశాలపై సమీక్ష చేసి, దిశా నిర్దేశం చేయబడుతుందని అన్నారు. అందులో భాగంగా నేటి మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల లో మహిళా శిశు సంక్షేమ శాఖ, టీటీడీ అధికారులతో ఈ అంశాలపై సమీక్షించి తనిఖీ చేసామని, వారు స్క్వాడ్ ఏర్పాటు చేసుకొని తిరుమలలో ఉన్న ప్రాంతాలలో తరచూ తనిఖీలు చేపట్టి బాల కార్మిక వ్యవస్థ లేకుండా, చిన్నారులు అడుక్కునే పరిస్థితులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో చేపట్టారని ఇది మంచి విధానమని కితాబిచ్చారు. ఎన్ సి పి సి ఆర్ క్షేత్రస్థాయిలో బాల కార్మిక వ్యవస్థ, చిన్నారులు అడుక్కోవడం లాంటి సామాజిక రుగ్మతల పై తనిఖీ చేసి చర్యలు తీసుకోవడం, పర్యవేక్షించడం జరుగుతోందని, అంగన్వాడి కేంద్రాలను, చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేపట్టటం జరుగుతోందని అన్నారు. బాలల హక్కులను కాపాడే అన్ని రకాల కార్యక్రమాలను కమిషన్ చేపట్టి బాలలు వారి బాల్యాన్ని సంతోషంగా అనుభవించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి శివ శంకర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, సిడిపీఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.