-బడిమానేసిన పిల్లలను గుర్తించి విద్య లేదా ఉపాధి శిక్షణకు అవకాశం కల్పించాలి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులలో పూర్తి సౌకర్యాలు కల్పించి, జగనన్న విద్యాకానుక అందించి జూన్ 12 న పండుగ వాతావరణంలో ప్రారంభానికి సిద్దంగా వుండాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రానున్న విద్యాసంవత్సరంలో బడులలో అన్ని వసతులు కలిగివుండాలని, ప్రారంభం రోజే పిల్లలకు విద్యాకానుక అందించేలా చర్యలు చేపట్టాలని ప్రత్యేక సూచనులు ఇచ్చారని అన్నారు. విద్యాకానుక అందిన వెంటనే అందులోని ప్రతి వస్తువు నాణ్యత పరిశీలించాలని, క్వాలిటీ వాల్ ఏర్పాటు చేసి స్థానిక ప్రజలను, ప్రజాప్రతినిధులను స్వయంగా పరిశీలించే విధంగా ఆడిట్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని సూచించారు. నాణ్యతాలోపం వుంటే మార్పుకు అవకాశం వుందని అన్నారు. విద్యాకానుక కిట్లు త్వరగానే మండల స్టాక్ పాయింట్లకు చేరుతాయని, వాటి నాణ్యత పరిశీలన పూర్తిచేయాలని అన్నారు.
గత సంవత్సరం పదవతరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులు 637 మంది వున్నారని వారిని తప్పనిసరి గుర్తించి టీచర్లకు సబ్జెక్ట్ భోదనకు అనుసంధానం చేయాలని, సమ్మతి చూపని వారిని ఖాళీగా ఉంచరాదని యవ వయస్సు వారిదని, తప్పనిసరి స్కిల్ డెవెలప్ మెంట్ ద్వారా నచ్చిన రంగంలో సాంకేతిక శిక్షణ ఇప్పించాలని, శిక్షణ పూర్తిగా ఉచితమని , ఉపాది కల్పించడం జరుగుతుందని అన్నారు.
పాఠశాలలు తెరవడానికి మనకు దాదాపు 40 రోజుల సమయం వుందని నాడు – నేడు పనులు పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలల్లో విద్యత్ సౌకర్యం, మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి , పర్నిచర్ రిపేర్లు కిచెన్ షెడ్ల నిర్మాణాలు, పెయింటింగ్ వంటివి పూర్తికావాలని , వాచ్ మాన్ నియామకం పేరెంట్స్ కమిటీ సమావేశంలలో పూర్తికావాలని అన్నారు. వసతుల కల్పనలో ఎం.ఇ.ఓ .లు సచివాలయ మహిళా పోలీస్ , ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ , ఎ.ఎన్.ఎం. లతో సమన్వయం పనులు పూర్తి చేయాలని అన్నారు. రానున్న విద్యాసంవత్సరం నుండి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రతి పాఠశాలలో ఈ సౌకర్యం రానున్నాదని అన్నారు.
ఇప్పటికే అందించిన ట్యాబ్ ల వినియోగ సమయం పెరగాలని, ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని వాటిలో సాంకేతిక లోపం వస్తే వెంటనే సంబందిత టీచర్ డిజిటల్ అసిస్టెంట్ కు అందజేయాలని, తిరుపతి కేంద్రంగా 4 సర్వీస్ సెంటర్లు వున్నాయని సూచించారు.
ఈ సమీక్షలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ , జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీర్ శంకరనారాయణ , గ్రామీణ నీటిపారుదల ఇంజనీర్ విజయకుమార్ , ఇరిగేషన్ అధికారులు , స్కిల్ డెవెలప్ మెంట్ అధికారి శ్యాం మోహన్ , ఎం.ఇ.ఓ. లు , హెచ్ ఎం లు పాల్గొన్నారు.