Breaking News

రైతులు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలు

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
అకాల వర్షాలు సమయంలో రైతులు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వరి పంటకు తీసుకోవలసిన జాగ్రత్తలు…
1. కోతలకు 10 – 15 రోజులలో… చేను పడిపోయి నీట మునిగితే, బూజు తెగుళ్ళ వల్ల గింజ రంగు మారే అవకాశం ఉన్నది. కాబట్టి వర్షాలు తగ్గిన వెంటనే లీటరు నీటికి 1.0 మి.లీ ప్రోపికోనజోల్ (టిల్ట్/ బంపర్/ప్రొపిగార్డ్) లేక 1.0 గ్రా. కార్బెండిజం (బావిస్టిన్ / ధనుస్టిన్ / బెన్ ఫిల్/చెన్ గార్డ్) లేక 2.0 కార్బండిజం ప్లస్ మాంకోజబ్ (సాఫ్/సిక్సర్/ కంపానియన్) చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు.

2. కోత కోసి పనలపై ఉన్న దశలో…
మనుషులతో కోత కోసిన పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని (లీటరు నీటికి 50 గ్రా కల్లుప్పు) పనలపై పడే విధంగా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గి, ఎండ రాగానే పనలను తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. పొలంలో నీరు లేకపోయినట్లయితే మడిలోనే |పనలపై ఉప్పు నీరు చల్లుకోవచ్చు. ఒక వేల పొలం లో నీరు నిలిచి ఉన్నట్లయితే పనలను గట్ల పైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు, ద్రావణం చల్లుకోవడం ద్వారా మొలకెత్తకుండా, రంగుమారకుండా నివారించవచ్చు.

3. పనలు కుప్ప వేసే దశలో….
కుప్పవేసే సమయంలో తుఫాను లేదా అకాల వర్షాల వల్ల పనలు తడిచినట్లైతే, కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చు.

4. నూర్చిన ధాన్యం కళ్ళాలపై ఉన్నప్పుడు…
సూర్చిన ధాన్యం 2 – 3 రోజులు ఎండ బెట్టడానికి వీలు కాకపోతే కుప్పలలో గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడు వాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పును 20 కిలోల పొడి ఊక లేక 4 కిలోల వరి గడ్డితో కానీ కలిపి “ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తకుండా, చెడిపోకుండా. నివారించుకోవచ్చు. ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పార బట్టి నిలవ చేసుకోవాలి.

5. ధాన్యం పూర్తిగా తడిచి రంగు మారిపోయినప్పుడు…
పూర్తిగా తడిచిపోయి రంగు మారిపోయిన ధాన్యానికి మార్కెట్ పూర్తిగా తగ్గిపోతుంది కనుక, ఇటువంటి ధాన్యం పచ్చి బియ్యం కంటే ఉప్పుడు బియ్యంగా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు.

మొక్కజొన్న రైతులు పాటించవలసిన జాగ్రత్త లపై కలెక్టర్ మాధవీలత సూచనలను జారీ చేశారు. అధిక వర్షాల కారణంగా కోత దశ లో ఉన్న పైరు మరియు కోత తరవాత కల్లం పైన ఆరబెట్టిన మొక్కజొన్నలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలని కోరారు.

కోత దశలో ఉన్న పైరులో వెంటనే కోత చేపట్టాలన్నారు. తడిసిన కండెలను గచ్చు పై పలుచగా పేర్చి ఎండలో బాగా ఆరబెట్టి సాధ్యమైనంత త్వరగా నూర్పిడి చేపట్టాలని అన్నారు. కోత దశకు చేరువలో ఉన్న పంట నేలకు ఒరిగితే పొలంలోని నీటిని పిల్ల కాలువల ద్వారా బయటకు పంపించి చేను పైన ప్రోపికొనజోల్ 1 మి లీ. లేదా హెక్సాకొనజోల్ – 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు. కోత తరువాత కలం పైన ఆరబెట్టిన మొక్కజొన్న వీలైనంత వరకు నీటిలో తడవకుండా చూడాలని, తడి కండెల పైన టార్ఫాలియన్ కప్పకూడదని, గాలి బాగా తగిలేల నీడలో ఆరబెట్టుకోవాలన్నారు.

.. అవసరాన్ని బట్టి కండెల పైన ఐదు శాతం మెత్తటి ఉప్పును తడిచిన కండెలు పైన పలుచగా చల్లి కింద మీద బాగా కలపడం వల్ల మొలక రాకుండా కొంత వరకు నివారించవచ్చు అన్నారు. తడికండెలను కుప్పగా పోయకుండా గచ్చు పై పలుచగా పేర్చి బాగా ఆరబెట్టి సాధ్యమైనంత త్వరగా నూర్పిడి చేపట్టాలన్నారు

జొన్న పంటలకు చెంది పంట కోతకు వచ్చిన వెంటనే సకాలములో ఆలస్యం కాకుండా పంటను కోయాలన్నారు. పంట కోతకు 10-15 రోజుల సమయం ఉన్న పరిస్తితులలో కంకులమీద బూజు నివారణకు ప్రోపికొనజోల్ 25% ఇ.సి 0.5 మీ.లీ లీటరు నీటికి వంతున కలిపి మందు ద్రావణాన్ని కంకులపై 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచ్చికారి చేయాలి. ప్రోపికొనజోల్ 25% ఇ.సి ట్రేడ్ పేర్లు టిల్ట్, రాడార్, బంపర్, ప్రొపిగార్డ్ జెటాక్స్, డాస్, రిసల్ట్, పైనేడ్ లను వాడాల్సి ఉంటుందన్నారు. కంకులను ఇంకా పొలంలోనే ఉన్నప్పుడూ గింజలు మొలకెత్తకుండా నివారించేందుకు 2% ఉప్పు ద్రావణాన్ని( 20గ్రా. లీటరు నీటికి) కంకులపై పిచ్చికారి చేయాలని తెలియ చేశారు. కంకులను కోసిన తరువాత పొలంలో ఉంచకుండా ఎండబెట్టుకొని వెంటనే నూర్పిడి చేయాలి. వర్షాలు ఆగిన వెంటనే పొలములో కంకులు తేమ ఆరిన వెంటనే పంటను కోయాలి.  నూర్పిడి చేసిన తరువాత గింజలలో తేమ శాతం 10-12% వచ్చేవరకు ఎండబెట్టాల్సి ఉంటుందన్నారు . డ్రయర్స్ సదుపాయము ఉన్న రైతులు గింజలను ఆరబెట్టుకోవడం ద్వారా పంట నష్టం కలగకుండా చేసుకోవచ్చునని తెలియ చేశారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *