– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జల సంరక్షణతో ఉమ్మడి కృష్ణా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన సర్ ఆర్థర్ కాటన్ జిల్లావాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అపర భగీరథుడి 220 వ జయంతి సందర్భంగా గవర్నర్ పేటలోని నీటి పారుదల కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. బీడు వారిన లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేయడంలో సర్ ఆర్ధర్ కాటన్ కృషి మరవలేనిదన్నారు. దేశచరిత్రలో తొలిసారిగా కృష్ణా, గోదావరి డెల్టాల వ్యవస్థను కాలువ ఆయకట్లు, అలాగే డ్రైనేజీ సదుపాయం, లాకుల వ్యవస్థ నిర్మించి కాలువలలో ప్రవహించే నీరు వృధాకాకుండా రైతులకు ఎక్కువ నీరు ఉపయోగపడేలా డెల్టాను రూపొందించిన ఘనులు అని కొనియాడారు. ఆయన ఆలోచనలతో సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించడంతో పాటు జల రవాణా కోసం ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. నాలుగు పాయలపై 1847 నుంచి ఐదేళ్లపాటు శ్రమించి 1852 నాటికి సుమారు నాలుగు కిలోమీటర్లు పొడవు గల ఆనకట్ట నిర్మాణం పూర్తిచేశారని చెప్పారు. అలాగే కృష్ణా డెల్టా నేడు పాడి పంటలతో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందంటే.. అది కాటన్ చలువేనని కీర్తించారు. ఆంధ్రప్రాంతాన్ని అన్నపూర్ణగా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చడంలో కాటన్ కృషి మరువలేనిదని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
కాటన్ స్ఫూర్తితో ప్రభుత్వం అడుగులు
సర్ ఆర్ధర్ కాటన్ స్ఫూర్తితో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.. కృష్ణా డెల్టాను ఆధునికీకరించడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వరప్రదాయిని అయినటువంటి పులిచింతలను ప్రారంభించి పూర్తిచేసిన ఘనత ఆ మహానేతకే దక్కుతుందన్నారు. జలయజ్ఞం పథకం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా చేశారన్నారు. జిల్లాలో డ్రెయిన్లు, వంతెనల నిర్మాణాలు వైఎస్ హయాంలో నిర్మించినవే అని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన కృషి వల్ల నేడు జిల్లా వ్యవసాయానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. వైఎస్ ఆశయాలను కొనసాగిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ, సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ.. జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు.
కృష్ణా నదిపై కొత్తగా మూడు బ్యారేజీలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీలతో పాటు ఎగువన మరో బ్రిడ్జి నిర్మాణానికి జల వనరుల శాఖ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. దిగువన చోడవరం వద్ద 2.70 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, బండికొల్లంక వద్ద 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మాణానికి., ఎగువన దాములూరు వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో మూడో బ్యారేజీ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించి.. ప్రభుత్వానికి పంపడం జరిగిందని వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయితే కృష్ణా వరద ప్రవాహాన్ని కాలువల ద్వారా మళ్లించి ఆయకట్టుకు నీటిని అందించడంతో పాటు.. తాగునీటి అవసరాలను తీర్చవచ్చని చెప్పారు. మరోవైపు సర్ ఆర్థర్ కాటన్, వైఎస్సార్ స్ఫూర్తితో పోలవరం నిర్మాణాన్ని సైతం త్వరితగతిన పూర్తిచేయాలన్న సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. అలాగే రైతులకు ఎలాంటి నష్టం రాకుండా ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. చంద్రబాబు హయాంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రాబోవు రోజుల్లో కాటన్ ఆశయాల సాధన కోసం.. రైతన్నల అభ్యున్నతి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ (ఇరిగేషన్) తిరుమల రావు, నాయకులు కొలనుకొండ శివాజీ, వడ్డే శోభనాదీశ్వరరావు, ధనేకుల మురళి, సీపీఎం సీహెచ్ బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News