– సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆర్థిక సహాయ మంజూరు పత్రాలు పంపిణీ సభలో ఎంపీ భరత్
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల సొంతింటి కల సాకారం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా పథకం’ కింద సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆర్థిక సహాయ మంజూరు పత్రాలను ఎంపీ భరత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 223మంది లబ్ధిదారులకు ఈ పత్రాలను ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో లబ్ధిదారునికి రూ.1.8 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాయని తెలిపారు. అలాగే గృహనిర్మాణానికి అవసరమైన ఇసుక, ఐరన్, సిమెంట్ తదితర మెటీరియల్ ను సబ్సిడీ పై అందజేసి సహకరించనున్నట్టు తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలలో అర్హులైన పేదలు 32 లక్షల మందికి సొంత గూడు కల్పించాలని ఎంతో పట్టుదలతో ఉన్నారని, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా అనుకున్నది సాధించే వరకూ నిద్రపోని సీఎం జగన్ విజయం సాధించారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇల్లు కవాలన్నా, పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీలనో, టీడీపీ నేతలనో, వారి అనుచరులనో..లేక సానుభూతిపరులకు అదీ లంచం ఇస్తేనే పని అయ్యేదని, ఇప్పుడా దుస్థితి లేదన్నారు. ఎవ్వరికీ ఒక్క పైసా లంచం ఇవ్వకుండా పేదలకు పారదర్శకంగా లబ్ధిని అందజేస్తున్న ప్రభుత్వం జగనన్న పాలనలోనే సాధ్యమైందని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సమర్థవంతంగా అర్హులైన పేదలందరికీ అందుతున్నాయంటే దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కారణమని అన్నారు. ఈ వ్యవస్థలు నీతి నిజాయితీగా పనిచేయడం, ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుండటంతో ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక వాలంటీర్ల వ్యవస్థపై బురదజల్లేపని ప్రారంభించాయని ఎంపీ భరత్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ ప్రభుత్వానికి పేరొస్తోందనే ఈర్ష్యతో వాలంటీర్ వ్యవస్థపై ఈ విధమైన దాడులకు ప్రతిపక్షాలు దిగుతున్నాయని అన్నారు. ఇది చాలా విచారకరమని, ప్రజలంతా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 32 లక్షల మంది పేదలకు సొంతిల్లు కట్టించాలన్నది సీఎం జగన్ లక్ష్యమని, ఇది దేశ చరిత్రలోనే రికార్డు అన్నారు. ప్రస్తుతం మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ళను నిర్మించుకోవాలని, దశల వారీగా వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని ఎంపీ భరత్ తెలిపారు. ఆయా వార్డు ఇన్చార్జులు దగ్గరుండి లబ్ధిదారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ పీ సత్యవేణి, జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి జీ పరశురామ్, హౌసింగ్ డీఈఈ కే సూరిబాబు, హౌసింగ్ ఏఈ కే ఉమాశంకర్, రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పాలిక శ్రీను, మార్గాని సురేష్, మింది నాగేంద్ర, పిల్లి నిర్మల, అన్నపూర్ణ రాజు, బర్రే కొండబాబు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, దుంగా లక్ష్మి, హసీనా బేగమ్, బ్యుల్డర్ చిన్న, లంకా ప్రసాద్, మేడబోయిన సునీల్ కుమార్, గుత్తుల భాస్కర్, బళ్ళా శ్రీనివాస్, తిరగాటి దుర్గ తదితర వైసీపీ నాయకులు, వార్డు ఇన్చార్జులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.