-అర్హులను గుర్తించి పథకాలు అమలు చేస్తున్నాం
-గ్రామంలో 1296 మందికి ధ్రువ పత్రాలు అందజేశాం
– జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
– ఏమ్మేల్యే తలారి వెంకట్రావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రతి ఒక్క అర్హులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని లక్ష్యంతో నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ఇంటింటి సర్వే చేపట్టి నెలరోజులు ప్రజలతో మమేకమైనట్లు జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత పేర్కొన్నారు.
బుధవారం గోపాలపురం గ్రామంలో స్థానిక ఏ ఎమ్ సి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత అర్హత ఉన్న లబ్దిదారులకు పథకాలు అమలు కాకుండా ఉంటే వారిని గుర్తించి ఆమేరకు సంక్షేమ పథకాలను అమలు చేయడం, ద్రువపత్రాలు అందచేసే బృహత్తర కార్యక్రమం జగనన్న సురక్ష లో భాగంగా చేపట్టడం జరిగిందన్నారు. నవరత్నాలు కింద 99 శాతం మంది అర్హులకు పథకాలను అమలు చేయడం జరిగిందని, మిగిలిన ఒక్క శాతం మంది వివరాలు ఇంటింటి సర్వే ద్వారా అందచేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావు తన నియోజక వర్గంలో జరిగే జగనన్న సురక్ష ప్రతి ఒక్క గ్రామ సభలో తాను భాగస్వామ్యం అవ్వాలని కోరడం, ఆమేరకు షెడ్యూల్ సిద్దం చేశామని కలెక్టర్ అన్నారు. ఇప్పటి వరకు ప్రతి గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యల పట్ల ఆయనకు ఉన్న నిబద్దత చాటుకోవడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈరోజు గ్రామ సభలో 1296 మంది అర్హులకు ఆదాయ, కుల, సమీకృత ధ్రువపత్రాలు అందచేశామని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, వాటికి అనుగుణంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చిన ముఖ్యమంత్రి దూరదృష్టి ద్వారా పారదర్శకంగా, జవాబుదారీతనం తో ప్రజలకు సత్వర సేవలు అందించడం సాధ్యం అవుతోందని మాధవీలత పేర్కొన్నారు.
శాసనసభ్యులు తలారి వెంకట్రావు మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు దళారుల ప్రమేయం లేకుండానే నేడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేయడం సాధ్యం అయిందని పేర్కొన్నారు. గోపాలపురం గ్రామంలో 1412 గడపలు ఉండగా ఇంటింటి సర్వే లో భాగంగా 1396 టోకెన్లు జారీ చేయడం ద్వారా 1296 అర్హులకు ధృవ పత్రాలను జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కుల, మత, వర్గాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు ఆమేరకు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏదైనా సేవలు పొందాలంటే అధికారుల చుట్టూ తిరిగే వారని, నేడు జగనన్న సీఎం అయ్యాక ప్రజల వద్దకే వచ్చి అర్హత మేరకు ఇంటి వద్ద ఆయా పథకాలు అమలు చేస్తున్న పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలలో జగనన్న సీఎం అయిన తరువాత రాష్ట్రంలో 10 కోట్ల 50 లక్షల మంది లబ్ధిదారులకు రూ.3 లక్షల 15 వేల కోట్ల రూపాయల మేర సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. సిఫార్సులకు స్వస్తి పలికి అర్హులైన వారికి నేరుగా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎస్. మల్లి బా, స్పెషల్ ఆఫీసర్ డా ఎస్ జీ టి సత్య గోవింద్,జెడ్పీటీసీ కె. లలిత, ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, సర్పంచ్ పైడి శిరీష, అతిరాస కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ళ భాస్కర్ రావు, ఏ ఎం సి చైర్మన్ జీ. జనార్ధన్, తహశీల్దార్ రవీంద్ర, ఎంపిడివో ఆర్. శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.