– లోక్ సభలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని అడ్ హాక్ గ్రాంట్ అంచనాలను రూ.12,911 కోట్ల నుంచి రూ.17,148 కోట్లను సవరించేందుకు కేంద్రం అంగీకరించిందని, వాటిని వెంటనే శాంక్షన్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. గురువారం లోక్సభలో 379 నిబంధన కింద లేవనెత్తిన అంశంపై ఎంపీ భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి నదిపై పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు నుంచి ఇంటర్మీడియట్ ప్రయోజనాలకు ప్రాజెక్టు కనిష్ట డ్రా డౌన్ లెవెల్ +41.15 మీటర్ల వరకూ వేగంగా అమలు చేయడం ద్వారా సాధించడానికి అంచనా వేయడానికి అవసరమైన తాత్కాలిక నిధులు రూ. 17,148 కోట్లు, పూర్తి రిజర్వాయర్ స్థాయి (ఎఫ్ఆర్ఎల్) +45.72 మీటర్ల వరకూ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు రూ.55 వేల కోట్లు సవరించిన (2019-20) అంచనా వ్యయంగా ఎంపీ భరత్ లోక్సభలో వివరించారు. అయితే 2021, 2022 సమయంలో గోదావరిలో భారీ వరదలు సంభవించాయని, ఆ ప్రభావం చుట్టు ప్రక్కల ప్రాంతాలపై కూడా పడటంతో ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణ పునరావాసం, సహాయ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చేయాల్సి వచ్చిందన్నారు. కాబట్టి గోదావరి వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా..కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేందుకు అంగీకరించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ భరత్ కోరారు. తాత్కాలిక ప్రాతిపదికన నిధులు, సవరించిన ఖర్చుల తుది అంచనా పెండింగ్లో ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎంపీ భరత్ గుర్తు చేశారు. ఆ నిధులు శాంక్షన్ చేస్తే ప్రాజెక్టు నిర్మాణ పనులు సజావుగా సాగుతాయన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా నిర్వాసితులకు పునరావాస సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుందని తెలిపారు. భూసేకరణ సహా బహుళ ప్రయోజన నీటి పారుదల ప్రాజెక్టు అమలును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడానికి వీలు కలుగుతుందని ఎంపీ లోక్సభలో గురువారం కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు.