-సమగ్ర శిక్షణ, తక్షణ ఉపాధి చూపే ఇంటిగ్రేటెట్ కోర్సుగా రూపకల్పన
-ఆగస్టు 11 వరకు రిజిస్ట్రేషన్ కాలపరిమితి పొడిగింపు : నాగరాణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాలిటెక్నిక్ విద్యార్ధుల కోసం హెచ్‌ఎల్ మండో ఆనంద్ ఇండియా సంస్ధ తమిళనాడులోని అన్నా యూనివర్శిటీ సహకారంతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో అందిస్తున్న బి.ఇ (ట్రైనింగ్ ఇంటిగ్రేటెడ్) డిగ్రీ ప్రోగ్రామ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ కాలపరిమితిని ఆగస్టు 11 వరకు పొడిగించిన నేపధ్యంలో ఈ సమీకృత శిక్షణా డిగ్రీ ప్రోగ్రామ్ ను వినియోగించుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ డిగ్రీని కొనసాగిస్తూ, పరిశ్రమకు అవసరమైన పూర్తి స్దాయి శిక్షణను పొందగలిగేలా ఈ కోర్సును రూపొందించారని, కాంచీపురంలోని విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఈ కోర్సు అందుబాటులో ఉందని వివరించారు. అత్యంత విలువైన పారిశ్రామిక శిక్షణను పొందుతూ, ఇంజనీరింగ్ పట్టా పొందగలిగిన ఈ కోర్సు విద్యార్ధులు ఉన్నత స్ధానాలకు చేరుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సమీకృత శిక్షణ బి.ఇ కోర్సులో ప్రవేశం తీసుకునేందుకు 2022, 2023 లలో పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని నాగరాణి స్పష్టం చేసారు. హెచ్‌ఎల్ మండో ఆనంద్ ఇండియా, అన్నా యూనివర్శిటీ బి.ఇ (ట్రైనింగ్ ఇంటిగ్రేటెడ్) డిగ్రీ ప్రోగ్రామ్ ద్వారా విద్యావ్యవస్ధ, పరిశ్రమల నడుమ అంతరాన్ని తగ్గించడంతో పాటు ఆశాజనకమైన కెరీర్ పథానికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు మరింత సమాచారం, నమోదు వివరాల కోసం https://cfa.annauniv.edu/cfa/ వెబ్ సైట్ ను సందర్శించాలని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నాగరాణి వివరించారు.