-ఎర్రకోటలో జరగనున్న వేడుకలకు దేశం నలుమూలల నుంచి హాజరుకానున్న 1800 మంది ప్రత్యేక ఆహ్వానితులు; కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఉత్సవాల్లో పాల్గొని, ప్రధాని ప్రసంగం వినే అవకాశం
న్యూదిల్లీ/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 15న, ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన తర్వాత ప్రధాన మంత్రి చేసే ప్రసంగం వినడానికి దేశంలోని నలుమూలకు చెందిన 1800 మంది ప్రత్యేక వ్యక్తులకు ఆహ్వానం అందింది. ఈ 1800 మంది ప్రత్యేక ఆహ్వానితుల నడుమ ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి. వీరి సమక్షంలో, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వైబ్రంట్ విలేజ్‌ల సర్పంచులు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు; సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, అమృత్ సరోవర్, హర్‌ఘర్ జల్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పని చేస్తున్న వ్యక్తులు ప్రత్యేక ఆహ్వానితుల్లో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు డా.డి.వికె.జి. త్యాగరాజ్, రేఖ మిట్టపల్లిని న్యూదిల్లీలో జరిగే స్వాతంత్ర్య వేడుకల కోసం కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. విశాఖపట్నంలోని కేంద్రీయ విద్యాలయ సంగఠన్‌లో వీళ్లిద్దరూ సేవలు అందిస్తున్నారు. ఈ ఆహ్వానం అందుకున్న 25 మంది కేవీఎస్ ఉపాధ్యాయుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్లిద్దరు ఉన్నారు. ఆగస్టు 15న చారిత్రాత్మక ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా తమ జీవిత భాగస్వాములతో కలిసి హాజరుకావడానికి వీరికి ఆహ్వానం అందింది.
కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా, దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఎర్రకోటలో వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందినందుకు డా.త్యాగరాజ్, రేఖ మిట్టపల్లి సంతోషం వ్యక్తం చేశారు. తమలాంటి సామాన్యులను కూడా న్యూదిల్లీలో జరిగే ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News