విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు, అభాగ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నందమూరి నగర్ కు చెందిన వైసీపీ నాయకులు ప్రసాద్ అల్లుడు చుండూరు వెంకటేశ్వరరావు(44) ఇటీవల రామవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరి కుటుంబ దయనీయ పరిస్థితిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో.. రూ. 5 లక్షల విలువైన చెక్కు మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డితో కలిసి మృతుని కుటుంబసభ్యులకు శనివారం ఎమ్మెల్యే చెక్కును అందజేశారు. ప్రమాదాలు, విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలను మానవీయ కోణంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదుకుంటోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ఇటీవల సూర్యలంక బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి చనిపోయిన ఆరుగురు యువకుల కుటుంబాలకు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున రూ. 18 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు చెప్పారు. 58వ డివిజన్ కు చెందిన తోట పవన్ కళ్యాణ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు మద్రాస్ నగరంలో సముద్రంలో మునిగి చనిపోతే.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అతని కుటుంబానికి తక్షణమే రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందేలా చూడటం జరిగిందన్నారు. అలాగే విధులు నిర్వహిస్తూ ఎలక్ట్రిక్ షాక్ కు గురై మృతి చెందిన పఠాన్ అయూబ్ ఖాన్, మద్దాలి సాయి లోకేష్ కుటుంబాలకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఆఫ్ ఏపీసీపీడీసీఎల్ తో మాట్లాడి రూ. 5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేయించినట్లు వెల్లడించారు.
ప్రజారోగ్య రంగంలో నూతన శకం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజారోగ్య రంగంలో నూతన శకం ప్రారంభమైందని మల్లాది విష్ణు అన్నారు. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లు, ఫ్యామిలీ డాక్టర్, 104 వాహనాల ద్వారా ప్రతి గడపకూ అత్యాధునిక వైద్యం అందుతోందన్నారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మరో ముందడుగు వేసి ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టడం నిజంగా విప్లవాత్మకమన్నారు. చంద్రబాబు పాలనలో వైద్య ఆరోగ్యశాఖ వెంటిలేటర్ పై ఉండేదని మల్లాది విష్ణు గుర్తుచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత శాఖకు జీవం పోశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా.. ఈ ప్రభుత్వంలో ఏకంగా 3,118 ప్రొసీజర్లకు పథకం వర్తింపచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తించని అనేక రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం చేయించుకోవచ్చన్నారు. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో 923 మందికి రూ. 4 కోట్ల 49 లక్షల 18 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. 91 మందికి రూ. 2 కోట్ల 54 లక్షల 73 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను అందించినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 6 కోట్ల 87 లక్షల 10 వేల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. కనుక ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలు ఆపద వస్తే అధైర్యపడొద్దని సూచించారు. వైద్య ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న సంస్కరణలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. తమ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి మృతుని కుటుంబసభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.