-మంచి వ్యక్తి : చంద్రబాబు
-సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి మారు పేరు : మెగాస్టార్ చిరంజీవి
-మీరు చూపించిన మార్గానికి ధన్యవాదాలు నాన్నా: మహేశ్ బాబు
-మీరంటే ఎప్పటికీ గౌరవం : విజయశాంతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు చిత్రసీమలో మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మే 31 సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. సోషల్ మీడియాలో ఆయనపై జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు, చిరంజీవి, మహేశ్ బాబు, నారా లోకేశ్, విజయశాంతి తదితరులు నటశేఖరుడిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్లకు పైగా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించి… సూపర్ స్టార్ గా, మంచి వ్యక్తిగా, మాజీ ఎంపీగా ప్రజాదరణ పొందిన ఘట్టమనేని కృష్ణ కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు స్పందించారు. భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ప్రశాంతతను అందివ్వాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
తన సినీ రంగ సహచరుడికి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా విషెస్ తెలియజేశారు. సాహసానికి మారుపేరు, మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
‘హ్యాపీ బర్త్ డే నాన్నా. నేను ముందడుగు వేయడానికి మీరు చూపించిన మార్గానికి ధన్యవాదాలు. మీరు ఊహించిన దాని కంటే మిమ్మల్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను’ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మరోవైపు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి స్పెషల్ ట్రీట్ ఉంటుందని అభిమానులు భావించారు. అయితే, కరోనా నేపథ్యంలో ఎలాంటి అప్ డేట్స్ ఉండబోవని చిత్ర యూనిట్ తెలిపింది.
కృష్ణతో అనేక హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించిన విజయశాంతి కూడా శుభాకాంక్షలు అందజేశారు. కిలాడీ కృష్ణుడు నుంచి ఒసేయ్ రాములమ్మ వరకు తమ కాంబినేషన్ లో హిట్లు, సూపర్ హిట్లు, సెన్సేషనల్ హిట్లు వచ్చాయని వెల్లడించారు. ‘మీరంటే ఎప్పటికీ గౌరవం సర్’ అంటూ విజయశాంతి వినమ్రంగా స్పందించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా కృష్ణకు విషెస్ తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో సరిసమానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సేవలు అందించిన సూపర్ స్టార్ కృష్ణ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో, ఆనందాలతో మరెన్నో ఘనమైన పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.