Breaking News

తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది – మంత్రి కాకాణి

-తిరుమలమ్మ పాలెం గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు వేగవంతం చేశామన్న మంత్రి కాకాణి
-బాధితుల పరామర్శకు బోటులో వెళ్లి మరీ నిత్యవసరాలు అందచేసిన మంత్రి కాకాణి
-19 మండలాలు తుఫాన్ వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
-144 పునరావాస కేంద్రాలు ఏర్పాటు, 8వేలకు పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు
-తుఫాన్ వల్ల దెబ్బదిన్న 300 చేపల చెరువులు

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించి మరమత్తులకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను బుధవారం ఆదేశించారు. అనంతరం తుఫాన్ బాధితులను పరామర్శించారు. తిరుమలమ్మ పాలెం గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు వేగవంతం చేశామని మంత్రి వెల్లడించారు. మంత్రి పర్యటనలో భాగంగా వెంకటాచలం మండలం గుడ్లూరివారిపాలెం, తిరుమలమ్మపాలెం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి నీట మునిగి రాకపోకలు నిలిచిపోవడంతో, ట్రాక్టర్ పై కొంత దూరం, బోటులో మరికొంత దూరం ప్రయాణించి బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. పుంజులూరుపాడులో గిరిజనులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తిరుమలమ్మపాలెం గ్రామం ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఈ ప్రాంతంలో బ్రిడ్జిని మంజూరు చేశారన్నారు. కొన్ని సాంకేతిక కారణాలు, డిజైన్ల మార్పు, భూసేకరణ జాప్యం వలన కొంతమేర ఆలస్యమైందని, ఈ నెలలోనే టెండర్లు పూర్తిచేసి బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలు పెట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈసారి తుఫాన్ సమయంలో ఈ గ్రామానికి బోట్లో కాకుండా నేరుగా వాహనంలో వచ్చేలా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడమే తమ లక్ష్యమన్నారు. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తుగా చేపట్టిన అప్రమత్తత చర్యల వలన వలన జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదన్నారు. కొంతమేర వరినార్లు నీటమునిగాయని, ఉద్యానవన పంటలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అన్నారు.
వరి నార్లు దెబ్బతిన్న రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా 80శాతం సబ్సిడీతో రైతుల కోరుకున్న విత్తనాలను నేటి నుంచి అందజేస్తామని మంత్ర కాకాణి చెప్పారు. దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని పూర్తిగా అందజేస్తామని, అన్ని విధాల అన్నదాతను ఉదారంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని ఒక్కో కుటుంబానికి 2500 రూపాయలు, ఒంటరిగా వున్న వారికి వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఇల్లు నీట మునిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, పామాయిల్ ప్యాకెట్, కందిపప్పు ఒక కేజీ, ఎర్రగడ్డలు కేజీ, ఉర్లగడ్డలు ఒక కేజీ చొప్పున ప్రతి కుటుంబానికి అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
మిచౌంగ్ తుఫాను వల్ల పంట పొలాల్లో నిలిచిన నీటిని త్వరితగతిన తొలగించుటకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ యం హరి నారాయణన్ పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లోని తుఫాను ప్రభావ జిల్లా కలెక్టర్లు తో తుఫాను అనంతర చర్యలపై వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ యం హరి నారాయణన్, ఏపీ జెన్కో ఎండి కె వి ఎన్ చక్రధర్ బాబు, జిల్లా ప్రత్యేక అధికారి, వ్యవసాయ శాఖ కమీషనర్ సి హరి కిరణ్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి లతో కలసి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ యం హరి నారాయణన్ తుఫాను అనంతర పరిస్థితిని ముఖ్యమంత్రి కి వివరిస్తూ, డిశంబర్ 2 నుండి 5 వరకు జిల్లాలో 27 సెం మీ ల వర్షపాతం నమోదైందని, మొత్తం 19 మండలాలు తుఫాను కు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నందువల్ల ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదన్నారు. పశునష్టం సైతం లేకుండా నివారించామన్నారు. మొత్తం 144 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 8 వేల మందిని సురక్షితంగా ఉంచి, మంచి భోజన వసతితో పాటు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిని క్షేమంగా వారింటికి చేర్చి నగదును అందజేయుటకు తగు ఆదేశాలిచ్చామన్నారు. ఇప్పటివరకు జరిగిన నష్టం ప్రాథమిక అంచనా మేరకు, ఇరిగేషన్ పరంగా కనుపూరు కాలువ కు రెండు చోట్ల గండ్లు పడ్డాయని, అంతకుమించి నష్టం నమోదు కాలేదన్నారు. విధ్యుత్ కు సంబంధించి 27 సబ్ స్టేషన్ల ను పురుద్దరించామని, మైపాడు సబ్ స్టేషన్ ను రాబోయే 24 గంటల్లో అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకూరుపేట మండలంలో అరటి, మిరప కొద్దిగా దెబ్బతిన్నాయని, అదేవిధంగా 300 చేపల చెరువులు దెబ్బ తిన్నాయని ప్రాధమికంగా గుర్తించామన్నారు. రాబోయే 3 రోజుల్లో పూర్తి స్థాయి నష్టాన్ని అంచనా వేయుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి హరి కిరణ్ జిల్లా లో వ్యవసాయపరంగా జరిగిన నష్టాన్ని గురించి ముఖ్యమంత్రి కి వివరించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *