రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిబద్ధత, స్పష్టత కలిగి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి వ్యవసాయ, పశు సంవర్ధక , పౌర సరఫరాల అధికారులతో ఆయా శాఖల పనితీరు పై జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, ఏ ఒక్క అధికారి గానీ, సిబ్బంది గానీ విధుల పట్ల అలసత్వం చూపరాదని, మీకు ఇచ్చిన లక్ష్యాలను నూరుశాతం సాధించడం జరగాలని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పని చేసే అధికారులు, సిబ్బంది విధుల మరింత అంకిత భావంతో పనిచేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకుని రావడం తోపాటు రైతులకు అందుబాటులో ఉండాలని రబీ సీజన్ సంబంధించి కొనుగోలు మరింత వేగవంతం చెయ్యాల్సి ఉందన్నారు. తగినంత మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన మౌలిక సదుపాయాలు , మానవ వనరుల కు కూడా సమకుర్చామని తేజ్ భరత్ పేర్కొన్నారు. ఎలక్షన్, ప్రకృతి వైపరిత్యాలు సందర్భంలో మరింత ఖచ్చితత్వం కలిగిన పని తీరు చూపడం కనీస బాధ్యత అన్నారు. సన్న కారు, చిన్నకారు రైతుల విషయంలోనే కాదు పెద్ద రైతు విషయంలో సరైన సమయంలో స్పందించి సమస్య పరిష్కారం చెయ్యాల్సి ఉందన్నారు. చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలని తీరు పనిలో చూపాలని స్పష్టం చేశారు.
రీ సర్వే పై మండల స్థాయి అధికారులతో విసి
రీ సర్వే ప్రక్రియలో రెండు దశ సర్వే ప్రక్రియను నిర్దుష్ట సమయం లో పూర్తి చేయాలన్నారు. తహశీల్దార్ లు వారి పరిధిలోని సిబ్బందికి సరైన మార్గ దర్శనం చేయాలన్నారు.
జగనన్న పాల వెల్లువ:
. జిల్లాలో జగనన్న పాల వెల్లువ కింద మొత్తం 48283 లబ్దిదారులు ఉంటారనే అంచనా లో ఇప్పటి వరకూ 2995 మంది ని అనుసంధానం చేయడం జరిగిందన్నారు. పశు క్రాంతి కిసాన్ కార్డుల జారీ కోసం 17621 మంది లబ్ధిదారులకు గాను నిప్పటి వరకు 7978 మంది వివరాలు నమోదు చేసి, వారిలో 1326 మందికి కార్డులు జారీ చేశామన్నారు. మిగిలిన వారి కూడా త్వరలో కార్డులను జారీ చేయాలన్నారు.
అంగన్వాడీ స్ట్రైక్:
జిల్లాలో 1556 కేంద్రాలకు గాను 1541 కేంద్రాలు గురువారం ప్రారంభించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పెర్స్ నిన్నటి నుంచి సమ్మె పై వెళ్ళడం జరిగిందన్నారు. ఇంకా తెరవని 15 కేంద్రాలను ఆయా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం వారి ప్రధాన 5 డిమాండ్ల పై సానుకూలంగా స్పందించారని తెలిపారు. టి హెచ్ ఆర్ కి సంబంధించి గుడ్లు, పాలు అందచేయ్యలన్నారు. ఆయా కేంద్రాలను దగ్గిరలోని మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతున్న స్కూల్ తో ట్యాగ్ చేయాలన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.