-చిన్నారులతో జాయింట్ కలెక్టర్ ముచ్చట్లు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడీ కార్యకర్తలు, సహయకుల సమ్మె కారణంగా అంగన్వాడీ కేంద్రాల లోని పిల్లలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శనివారం ఉదయం రాజమండ్రి అర్బన్ లింగాల పేట , రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట (120 ) అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ వివరాలు తెలియచేస్తూ, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న 1556 అంగన్వాడి కేంద్రాలలో ముగ్గురు చొప్పున వాలంటీర్ల ను ఏర్పాటు చేసి పిల్లల సంరక్షణ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కింద సమీపంలోని స్కూల్ నుంచి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పిల్లలకి క్రమం తప్పకుండా అందచేసే టి హెచ్ ఆర్ పోషణ కింద పాలు, కోడి గుడ్డు లను అందిస్తున్నట్లు తెలిపారు. తల్లి తండ్రులు వారి పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు యధావిధిగా పంపాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కేంద్రంలో ముగ్గురు వాలంటీర్లు ఉండి పిల్లల సంరక్షణ చెయ్యడం జరుగుతుందని అన్నారు. పిల్లలతో జాయింట్ కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న ఆహారం, ఆటలు పాటలు తదితర అంశాలపై మాట్లాడడం జరిగింది. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె. విజయ కుమారి, రూరల్ తహశీల్దార్ పి. చిన్నారావు, ఐ సి డి ఎస్ అధికారులు, సిబ్బంది, ఏ ఎన్ ఎమ్, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటరీలు పాల్గొన్నారు.