విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 19న నిర్వహించే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేసే సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జి జయలక్ష్మి కి వివరించారు.
సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిరూపమైన 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19న జరగ జరగనున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను శనివారం సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమానికి ఏలూరు, పల్నాడు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుండి సుమారు 80 వేలకు పైగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రానున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ లను గుర్తించి ఏర్పాటు చేస్తున్నామన్నారు. పటిష్ట భద్రత కల్పిస్తున్నామని, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి అంబేద్కర్ స్మృతి వనం వరకు మహాత్మా గాంధీ రహదారిపై బారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే విధంగా ఎల్ఈడి స్క్రీన్ లను నగరంలోని ప్రధాన కూడళ్ళు, ఎంజీ రోడ్డు లోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులపై ప్రజలు వస్తారని జిల్లాల వారీగా బస్సుల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మధ్యాహ్నం లంచ్, స్నాక్స్, రాత్రి డిన్నర్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లకు సంబంధించి అధికారులను ఇప్పటికే ఆదేశించామని కలెక్టర్ ఢిల్లీ రావు ప్రిన్సిపల్ సెక్రెటరీకి వివరించారు.