-జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ
-కలెక్టరేట్ లో ఘనంగా వేమన జయంతి వేడుకలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమన అని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహకవి వేమన జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జెసి గీతాంజలి శర్మ ముఖ్య అతిథిగా హాజరై వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,లోకానికి నీతి అంటే ఇది అని నేర్పి చూపిన గొప్ప ఆదర్శకవి యోగి వేమన అని, ఆ మహనీయుని మించిన కవులు చరిత్రలో లేరని, ఇకపై సైతం జన్మించలేరన్నారు. 16వ శతాబ్దంలోనే సమాజ కట్టుబాట్లు, మనిషి ప్రవర్తనలోని లోటుపాట్లను నాలుగే నాలుగు వచనాలు ఉపయోగించి సులువైన పద్యాల ద్వారా సూటిగా ప్రశ్నించిన గొప్ప కవి వేమన అని తెలిపారు. మహాకవి వేమన శైలి ఎవరికీ రాలేదని, ఆ తర్వాత కూడా ఎవరూ వేమనలాగా సరళమైన భాషలో పద్యాలు రాయలేకపోయారని కొనియాడారు.వేమన పద్యాలను నేటి తరంలోని ప్రతి ఒక్కరూ చదివి వాటిలోని సారాంశాన్ని తెలుసుకుని సామాజిక విలువలను కాపాడటంలో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కోరారు
మహాకవి శ్రీశ్రీ సైతం తనకు తెలిసిన కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ అని మాత్రమే చెప్పారంటే వేమన ఎంత గొప్ప రచయితే అర్థం చేసుకోవచ్చని ఆమె చెప్పారు. మానవ జీవితం, మనుషులు చేసే తప్పులు, కులాలు, మతాలు,సంఘంలోని కట్టుబాట్లు,నకిలీ సన్యాసులు, వంకర బుద్ధులున్న గురువులు.. ఇలా అందరినీ, అన్ని సమస్యలను తన పద్యాల ద్వారా ప్రశ్నించిన గొప్ప మేధావి, సంఘసంస్కర్త యోగి వేమని అని,ఏ కాలానికైనా వేమన పద్యం ఒక పరిష్కారం అని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి పెద్ది రోజా, కలెక్టరేట్ కార్య నిర్వాహణాధికారిణి రాధికా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.