తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
హెల్తీ విలేజ్లో ప్రధాన అంశాలుగా త్రాగునీరు పరిశుభ్రతపై పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచ్ లు దృష్టి పెట్టాలని గతంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఉదయం శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతున్న హెల్తీ విలేజ్ జాతీయ వర్క్ షాప్ 2 వ రోజు అంశం రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణ సేవల అంశాలపై నిర్వహణతో ప్రారంభం కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొనగా వివిధ శాఖల కమిషనర్లు ఉన్నతాధికారులు వారికి సంబంధించిన శాఖలలో అమలు చేస్తున్న అంశాలను సభను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… గ్రామాలలో త్రాగునీరు, పరిశుభ్రత ప్రధాన అంశాలని వాటిని మనం అధికమించాలని అన్నారు. త్రాగు నీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని అన్నారు. గ్రామపంచాయతీలు వీటిని సద్వినియోగం చేసుకొని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టినప్పుడే పరి శుభ్ర త్రాగునీరు విజయవంతంగా అమలు చేయగలుగుతామని అన్నారు. ఇక ముఖ్యమైన అంశం గ్రామాలలో పరిశుభ్రత ఇప్పటికే ప్రతి ఇంటికి స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకొని ఓడిఎఫ్ + లో కి వెళ్లేమని అన్నారు. అదే రీతిలో త్రాగునీటి విషయంలో కూడా శ్రద్ధ వహిస్తే నీటి సమస్య తలెత్తదని ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు ఉండవని అన్నారు.
గ్రామపంచాయతీలలో మురికి కాలువలు నిర్మాణం వల్ల నిర్వహణ పంచాయితీలకు భారంగా మారుతుందని, గ్రామ సర్పంచులు దృష్టి పెట్టి భూగర్భ డ్రైనేజ్ పైపులైన్ ద్వారా నిర్మాణం చేపడితే సమస్యలు తలెత్తవని అయితే ఇందులో మరుగుదొడ్లకు సంబంధించి ఆయా గృహాలలో సొక్ పిట్స్ ఏర్పాటు చేసి ఆనీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకొని గ్రే వాటర్ అంటే బాత్రూం నీళ్లు మాత్రమే అనుసంధానం చేయాలని సూచించారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు జరిగిందని 2వేల మంది జనాభాకు ఒక సచివాలయం అందుబాటులోకి తెచ్చామని సంక్షేమ పథకాలు సచివాలయ స్థాయిలో అందించే విధంగా చేపట్టామని అన్నారు. అలాగే వాలింటర్ వ్యవస్థ ఏర్పాటుతో ప్రతి 50 కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు వివరించి అర్హత కలవారికి అందించేలా వ్యవస్థ రూపొందించామని , కోవిడ్ సమయంలో వీరి సేవలు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. వైయస్సార్ విలేజ్ క్లినిక్స్ సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు రవాణా ఆర్థిక భారం తగ్గేలా వైద్య సేవలు అందించడానికి 24/7 అందుబాటులో ఉండేలా చేపట్టామని అన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయిలోనే అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు 14 రకాల వైద్య పరీక్షలు ఇక్కడే నిర్వహించి మందులు అందించడం జరుగుతున్నదని అన్నారు. ప్రజల ఆరోగ్య విషయంలో మరో ముందడుగు వేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో ఇంటింటి వైద్యం , జగనన్న ఆరోగ్య సురక్ష తో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం అవసరాన్ని బట్టి ఆరోగ్యశ్రీ ద్వారా నెట్వర్క్ హాస్పిటల్స్ కు రెఫర్ చేయడం వంటివి చేస్తున్నామని అన్నారు. ఇక ప్రధాన అంశాలైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధన విషయంలో గర్భిణీ స్త్రీలకు, 10 నుండి 19 వయసు గల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి రక్తహీనత తగ్గించే విధంగా పోషకాహారం అందించడం పాఠశాలలలో రాగిజావ తో పాటు జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్నం భోజనం పౌష్టికాహారం అందిస్తున్నామని వివరించారు. ప్రతి గ్రామానికి ఫైబర్ నెట్ అనుసంధానం చేశామని, సచివాల స్థాయిలోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే విధంగా ఏర్పాటు జరిగిందని వివరించారు.
కమిషనర్ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సూర్యకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ఏర్పాటుతో 1.4 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని గ్రామస్థాయిలోనే సిటిజన్ సర్వీసులు లతోపాటు 88 రకాల ప్రభుత్వ సేవలు ప్రస్తుతం అందించే ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామాలలో పరిశుభ్రత, త్రాగునీటి సౌకర్యం , వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ చేపట్టి పంచాయతీలకు ఆదాయం తెచ్చేలా చేస్తున్నామని అన్నారు. సచివాలయ వ్యవస్థలో పంచాయతీ సెక్రెటరీ ,డిజిటల్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ ,వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ,ఎనర్జీ అసిస్టెంట్ వెటర్నరీ మరియు ఫిషరీస్ అసిస్టెంట్ , రెవిన్యూ సెక్రెటరీ వంటి పోస్టులను నియమించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పాటు గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శిని నియమించి మహిళలకు అండగా, బాల్యవివాహాల నిషేధం దిశగా అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ప్రతి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సచివాలయ స్థాయి నుండి సమీక్ష నిర్వహించి రక్తహీనత గల వారిని గుర్తించి ఎప్పటికప్పుడు సేవలందించి ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. అంగన్వాడీలలో గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం పిల్లలలో ఎదుగుదల పరీక్షల నిర్వహించి ఎప్పటికప్పుడు వైద్య శాఖ సహకారంతో వైద్య సేవలు అందించి ఆరోగ్యంగా ఉంచడం చేపడుతున్నామని వివరించారు.
కమిషనర్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జె .నివాస్ వివరిస్తూ గ్రామాలలో హెల్త్ క్లినికల్ ఏర్పాటుతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ టెలిమెడిసిన్ సౌకర్యం కల్పించి దేశంలోనే అధికంగా టెలిమేడిసన్ వైద్య సేవలు అందించిన ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ ముందుందని అన్నారు. ఎక్కడలేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేసి ప్రతి సచివాలయ పరిధిలో ప్రతి నెలకు రెండుసార్లు 104 వాహనం పర్యటించి ఉ.9 గంటల నుండి సా.4 గంటల వరకు ఓపి సేవలు, వైద్య సేవలు ,మందుల పంపిణీ వంటివి చేపట్టడం జరుగుతున్నదని అన్నారు . వీటితోపాటు అంగన్వాడీలలో పాఠశాలలలో వైద్య పరీక్షలు నిర్వహించడం, బెడ్ రీడన్ వారికి వైద్య సేవలు జరుగుతుందని అన్నారు . గత తొమ్మిది నెలల కాలంలో 50 సార్లు రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహించామని గుర్తించిన జబ్బులకు వైద్య సేవలు అందించడం జరిగిందని అన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏఎన్ఎంలు ఆశాలు 24/7 అందుబాటులో ఉండేలా ఏర్పాటు జరిగిందని వివరించారు ఆరోగ్య సురక్ష పేరుతో ప్రతి 50 రోజులకు ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా 1.45 కోట్ల మందికి 10 వేల ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించి వైద్య సేవలు అందించడం జరిగిందని అన్నారు. వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు పరిమితి రూ .5 లక్షల నుండి 25 లక్షలకు పెంచి కార్డులను అందించడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు తాము అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు గ్రూపుగా ఏర్పడి ఒక్కొక్క అంశంపై తమ అభిప్రాయాలను సభ వేదికగా అన్ని రాష్ట్రాల వారు వివరించారు. ఇందులో ప్రధాన అంశాలు గ్రామాలలో సంక్రమిత అసంక్రమిత వ్యాధుల నివారణ, అందుబాటులో ఉండాల్సిన వైద్య సేవలు, మహిళలకు, చిన్న పిల్లలకు అందించాల్సిన వైద్య సేవలు సౌకర్యాలు, గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు, వారి జీవన విధానంలో రావలసిన మార్పులు, కుటుంబ నియంత్రణ మహిళలకు రక్షణ వంటి అంశాలపై గ్రూపుల వారీగా సభా వేదికగా తయారు చేసుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 7 గ్రూపుల వారు వివరించారు.