-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలుగొందుతున్న సత్యనారాయణపురంలో లోక కళ్యాణార్థం చేపట్టిన గణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నరసింహ హోమం, సుదర్శన హోమం, రాజమాతాంగి హోమం, బగళాముఖి హోమం, ప్రత్యంగిరా హోమాలు ఫలప్రదం కావాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. సత్యనారాయణపురంలోని గాయత్రీ కళ్యాణ మండపం నందు శనివారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు ఎమ్మెల్యే దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. అన్ని వర్గాల ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ.. మూడు రోజులుగా ఈ మహా యజ్ఞాన్ని తలపెట్టడం శుభపరిణామమని మల్లాది విష్ణు అన్నారు. కరువు కాటకాలు దరిచేరకుండా వర్షాలు సమృద్ధిగా పండాలని.. యాగ ఫలితాలు ప్రతిఒక్కరికీ దక్కాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. పాడి పంటలతో రైతులు, సకల వృత్తులూ పరిఢవిల్లాలని.. నిరుపేదలు, సామాన్యులు సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో విరాజిల్లాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్ప బలానికి దైవబలం కూడా తోడవ్వాలని కాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, సుఖ శాంతులు, సిరి సంపదలు చేకూరాలని.. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించాలని అభిలషించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, యల్లాప్రగఢ సుధీర్ బాబు, జె.కె.సుబ్బారావు, చల్లా సుధాకర్, శనగవరపు శ్రీనివాస్, కమ్మిలి రత్నకుమార్, కోలవెన్ను కొండా, ఎం.సత్యశ్రీహరి, కొప్పరపు మారుతి, చామర్తి మూర్తి, పి.సనత్, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.