Breaking News

విజయవాడ వేదికగా “టెక్నికల్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్”

-” నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్”లో భాగంగా చేనేత, జౌళి శాఖ ప్రతిష్టాత్మక నిర్వహణ: సునీత
-వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేయబడిన ఉపయోగకర ఉత్పత్తుల ప్రదర్సన : ఎంఎం నాయక్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ: భారత ప్రభుత్వ “నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్”లో భాగంగా చేనేత, జౌళి శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే “టెక్నికల్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్”కు ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. జనవరి 29వ తేదీన విజయవాడలో ఈ సదస్సు జరగనుండగా, ఇండియన్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ అసోసియేషన్‌కు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ నిరంతర సహకారం అందిస్తూ కార్యక్రమ నిర్వహణలో ప్రత్యేక చొరవ చూపుతోంది. నిశిత పరిశీలనతో కూడిన ప్యానెల్ చర్చలు, ప్రత్యేక వస్త్ర ప్రదర్శనతో కూడిన ఈ ఒకరోజు సదస్సు సాంకేతిక వస్త్రాలలో స్థిరమైన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి (చేనేత, జౌళి) కె.సునీత తెలిపారు.

ప్యానల్ స్పీకర్లుగా దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ ప్రముఖులు వ్యవహరిస్తున్నారన్నారు. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ వ్యూహాలు, జియోటెక్ టెక్స్‌టైల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ వాతావరణాన్ని తట్టుకోగల మౌలిక సదుపాయాలను నిర్మించడం, అగ్రోటెక్ సొల్యూషన్‌లను పెంచడం, సాంకేతిక టెక్స్‌టైల్స్ రంగంలో భవిష్యత్తు పోకడలు, అవకాశాలను గుర్తించడం వంటి కీలకమైన అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారని సునీత వివరించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సహా పలువరు ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని చేనేత, జౌళి శాఖ కమీషనర్ ఎంఎం నాయక్ తెలిపారు. జౌళి రంగంలో నూతన ఆవిష్కరణలు, సుస్థిరతను పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెప్పే ఈ కార్యక్రమం రూపకల్పన చేసామన్నారు.

వివిధ సంస్దల సిఇఓలు, వస్త్ర తయారీదారులు, ఇంజనీర్లు, డిజైనర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధుల కోసం రూపొందించబడిన ఈ సదస్సు పరస్పర జ్ఞాన మార్పిడికి ఉపకరిస్తుందని నాయక్ వివరించారు. ఇక్కడి ప్రదర్శనలో అత్యాధునిక సాంకేతిక వస్త్ర పురోగతిని అన్వేషించవచ్చని, పరిశ్రమను మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు నడిపించే ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని సునీత పేర్కోన్నారు. వినూత్న ప్రదర్శనలో అరటి ఫైబర్, జూట్, ఉన్ని, ఇతర వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేయబడిన ఉపయోగకర ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైనది కాబట్టి, వ్యవసాయ వ్యర్థాలను నూలు, ఫాబ్రిక్, కార్డ్‌బోర్డ్ మొదలైన ఉపయోగకరమైన ఉత్పత్తులకు మార్చడంపై ఈ సదస్సు ఉపయుక్తమైన సమాచారానికి వేదికగా నిలవనుంది.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *