– ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం
– రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ప్రజలు గర్వించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఆవిష్కరించారని.. ఇది ప్రపంచ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్.. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పాన్ని, స్మృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రూ. 2000 కోట్ల విలువ చేసే స్థలములో రూ. 400 కోట్లు ఖర్చు చేసి సామాజిక న్యాయ మహా శిల్పాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదొక అద్భుత కళాఖండం అని రోజూ వేలాదిమంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసుకుని మరి ఈ ప్రాంతానికి, ఈ పవిత్ర స్థలానికి ప్రజలు కులాలు, మతాలు వంటి వాటితో సంబంధం లేకుండా వస్తున్నారని వివరించారు. తాము పుట్టిన ప్రదేశంలో ఇలాంటి మహోన్నత కళాఖండం ఏర్పాటు కావడం దేశ ప్రజలు గర్వించదగ్గ విషయమని విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. కులం, మతం వంటి వాటితో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూసే సమాజ నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. బౌద్ధ సన్యాసులతో కలిసి ప్రబుద్ధ భారత్ నిర్మాణం క్యాలెండర్లను, పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలను అందించారు.