– ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని శ్రీనివాస్ (నాని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లా అన్ని విధాలా అభివృద్ధికి అవసరమైన సహాయసహకారాలను అందిస్తామని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, లోక్‌సభ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ. 5 లక్షలతో ఆధునికీకరించిన జిల్లా అర్థ గణాంకాధికారి కార్యాలయం, ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ. 8 లక్షలతో ఏర్పాటుచేసిన ఎంపీల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నానిలు పాల్గొని.. జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, అర్థ గణాంకశాఖ సంచాలకులు బి.గోపాల్ తదితరులతో కలిసి అర్థ గణాంకాధికారి కార్యాలయాన్ని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఎంపీల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఎంపీ కేశినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కార్యకలాపాలు, ఎంపీల్యాడ్స్‌కు సంబంధించి అర్థ గణాంకాధికారి కార్యాలయం కీలకపాత్ర పోషిస్తోందని.. ఈ కార్యాలయం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నిరాంటంకంగా కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వీలుగా జిల్లా అర్థగణాంకాధికారి కార్యాలయ ఆధునికీకరణకు అవసరమైన నిధులు అందించడం జరిగిందన్నారు. కలెక్టరేట్‌లో మరిన్ని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి, అందజేయాలని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ సూచించారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డిల్లీరావుగారు ప్రజాప్రతినిధులతో మంచి సమన్వయంతో వ్యవహరిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో సమస్యలను క్షుణ్నంగా అర్థం చేసుకొని ఆయా సమస్యల పరిష్కారానికి తమదైన శైలిలో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో దాదాపు 275 గ్రామాలకు మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు కలెక్టర్ చొరవే కారణమన్నారు. అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు చేసిన విజ్ఞప్తి మేరకు మంచి నీటి ట్యాంకులకు ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పార్టీలు, కులాలు, మతాలు.. ఇలా దేంతో సంబంధం లేకుండా గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకొని ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్ఆర్, ఎంపీల్యాడ్స్ తదితర నిధులతో జిల్లా అభివృద్ధికి కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కలెక్టరేట్‌లో ఆధునికీకరించిన అర్థగణాంకాధికారి కార్యాలయం, ఎంపీల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్‌లను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని నివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ గౌరవ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని శ్రీనివాస్‌లు ఎంపీల్యాడ్స్ నిధులతో కలెక్టరేట్‌లో ఆధునికీకరించిన భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని.. ఇందుకు ఎంపీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్ సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయడం జరుగుతోందని.. ఆయన కృషికారణంగా ఎ.కొండూరు తదితర ప్రాంతాల ప్రజలకు మంచి నీటి ట్యాంకులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. రెండు అడ్వాన్స్డ్ అంబులెన్సుల కోసం రూ. 28 లక్షలు మంజూరు చేశారన్నారు. అదే విధంగా 15-20 రోజులుగా కృషిచేసి రూ. 24 కోట్లతో కట్టలేరు బ్రిడ్జ్ నిర్మాణ పనులకు పరిపాలనా అనుమతులు తేవడం జరిగిందని.. త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వివరించారు. కార్యక్రమంలో సీపీవో వై.శ్రీలత, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎ.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏవో ఇంతియాజ్ పాషా, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్, స్టాటిస్టికల్ ఆఫీసర్ డీవీఆర్ ప్రసాద్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ సీహెచ్ సత్యనారాయణ, ఏడీ ఎం.లలితా దేవి, సీపీవో కార్యాలయ సిబ్బంది కె.సాంబశివరావు, ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.