-పాఠశాల కమిషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు
-ఆరు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా.. సైన్స్ ఫెయిర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల స్థాయి నుంచి పిల్లల్లో శాస్త్రీయ జిజ్ఞాసను రగిలిస్తూ, నూతన పోకడలను పరిశీలింపజేసినట్లయితే మెరుగైన నూతన విజ్ఞాన సమాజాన్ని మనం ఆవిష్కరించవచ్చని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం విజయవాడలోని మురళి రిసార్టులో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఘనంగా ప్రారంభించిన ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్’ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 210 ప్రాజెక్టులు మూడు విభాగాలుగా పాల్గొన్నారు. ఆరు రాష్ట్రాల ప్రాజెక్టులతో ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమానికి ఈసారి ఆంధ్రప్రదేశ్ వేదికగా ఆతిథ్యం ఇచ్చింది. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం (బెంగళూరు) వారి సహకారం అందించారు.
ఈ సందర్భంగా కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ… పాఠశాలలో పాఠ్యాంశాలతో పాటుగా సైన్స్ క్లబ్బుల నిర్వహణ, విజ్ఞాన యాత్రలు నిర్వహణ తదితర కార్యక్రమాలను ఉపాధ్యాయులు బాధ్యతగా నిర్వహించాలని, తద్వారా ప్రతి విద్యార్థినీ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు కొనసాగుతుందన్నారు.
అనంతరం సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠాలతో పాటు ప్రయోగాలు, ప్రాజెక్టుల నిర్వహణను విధిగా నిర్వహించినప్పుడే పిల్లల్లో శాస్త్రీయతను పెంపొందించవచ్చన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలతో పాటు వాటి వెనకున్న సైన్స్ అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు.
తర్వాత విశ్వేశ్వర ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం డైరెక్టర్ కె. సాజు భాస్కరన్ మాట్లాడుతూ దక్షిణ భారత రాష్ట్రాలలోని సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా విభిన్న భాషలు ప్రతిబింబించే విధంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం యువతలో ఉత్తేజాన్ని, సాధించాలన్న తపనను కలుగజేస్తుందన్నారు. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమై, సృజన కుమార్ మ్యాజిక్ తో పాటు, విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి, కృష్ణా జిల్లా డీఈవో తాహేరా సుల్తానా, సైన్స్ ఫెయిర్ కార్యక్రమం కోఆర్డినేటర్ డా. జి. ఆర్ భాగ్యశ్రీ, ఆరు రాష్ట్రాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.