Breaking News

టెక్నికల్ టెక్స్‌టైల్స్ ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దం

-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
-దేశాభివృద్దిలో టెక్నికల్ టెక్స్ టైల్స్ రంగం కీలక భూమిక : రాజీవ్ సక్సేనా
-సాంకేతిక వస్త్రాలలో స్థిరమైన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా సదస్సు : సునీత
-సాంకేతిక టెక్స్‌టైల్స్ రంగంలో అశాజనకమైన భవిష్యత్తు : ఎంఎం నాయక్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో విస్తృతమైన పరిధిని కలిగిన టెక్నికల్ టెక్స్‌టైల్స్ ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. భారత ప్రభుత్వ “నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్”లో భాగంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సోమవారం జాతీయ స్దాయిలో సాంకేతిక వస్త్రాల అభివృద్ది కోసం విధాన మార్గాల రూపల్పన ప్రధాన అంశంగా విజయవాడ వేదికగా ఒక రోజు సదస్సు నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అమరనాధ్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగ అభివృద్దికి దేశంలోని మరే రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లొ మూడు పారిశ్రామిక కారిడార్లు, సరిపడ సహజ వనరులు మరియు త్వరితగతంగా పరిశ్రమల ఏర్పాటు చేయుటకు క్లియరెన్స్ కోసం సింగిల్ విండో పోర్టల్ ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అవసమైన భూమి విషయంలోనూ కొరత లేదన్నారు. టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగం రాష్ట్రంలో అభివృద్ది సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహాకాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని స్ఫష్టం చేసారు. అయితే పారిశ్రామిక అభివృద్దికి విదేశీ పెట్టుబడులు అత్యావశ్యకమని, ఈ విషయంలో కేంద్రం మరింత సరళీకృతంగా వ్యవహరించాలన్నారు. ఎగుమతుల పాలసీల విషయంలోనూ మార్పులు అవసరమని అమరనాధ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

కేంద్ర జౌళి శాఖ సంయిక్త కార్యదర్శి రాజీవ్ సక్సేనా మాట్లాడుతూ రానున్న కాలంలో దేశాభివృద్దిలో టెక్నికల్ టెక్స్ టైల్స్ రంగం కీలక భూమిక పోషించనుందన్నారు. అయితే ఈరంగంపై మరింత అవగాహన కల్పించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ రంగానికి నైపుణ్యం కలిగిన మానవవనరుల అవసరం ఎంతో ఉందన్నారు. టెక్నికల్ టెక్స్ టైల్స్ పరిశ్రమ అభివృద్దికి నిధుల కొరత లేదని, కేవలం పరిశోధన కోసమే రూ.1000 కోట్లు కేటాయించామని వివరించారు. అతి తక్కువ వ్యయంతో యంత్ర సామాగ్రి అభివృద్దిపై దృష్టి పెట్టామన్నారు. మార్కెట్ అభివృద్ది, ఎగుమతుల ప్రోత్సాహం, స్టార్ట్ ప్ ల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ రంగంలోకి యువతను ఆకర్సించేలా టెక్నికల్ టెక్స్ టైల్స్ రంగంలో యుజి, పిజి కోర్సుల రూపకల్పన జరుగుతుందన్నారు.

చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత మాట్లాడుతూ వ్యవసాయ టెక్నికల్ టెక్స్ టైల్ రంగం ద్వారా వ్యవసాయ వ్యర్థాల సమర్ధవంతంగా వినియోగించుకోగలుగుతామన్నారు. అక్వారంగం టెక్నికల్ టెక్స్ టైల్ కు పెద్ద వినియోగదారునిగా ఉందని ఈ రంగం నుండి డిమాండ్ గణనీయంగా ఉండనుందని తెలిపారు. ఆగ్రోటెక్ టెక్స్ టైల్స్ సుస్థిర వ్యవసాయం, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపుకు దోహదం చేస్తాయన్నారు. ఎపి ప్రధానంగా వ్యవసాయ ఆధారితం కాగా, నికర విస్తీర్ణం (చేపల పెంపకంతో సహా) 60.88 లక్షల ఎకరాలలో 37.35 శాతం భూమిని కలిగి ఉందన్నారు. హార్టికల్చర్ లో ఆగ్రో టెక్స్ టైల్స్ వల్ల పంట ఉత్పత్తి పెరుగుతుందని, నీటి వినియోగం 30 నుంచి 45 శాతం తగ్గుతుందని, ఎరువుల వాడకం 25 నుంచి 30 శాతం తగ్గుతుందని, అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. దేశంలో, ఆంధ్రప్రదేశ్ అరటి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండగా, జనపనార ఉత్పత్తిలో 5 వ స్థానంలో ఉందని, వ్యవసాయ వ్యర్థాలను టెక్స్ టైల్ విలువ జోడింపు గొలుసులోకి తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని సునీత పేర్కొన్నారు. సాంకేతిక వస్త్రాల భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోందని, ప్రపంచ మార్కెట్ 2022 లో 195 బిలియన్ డాలర్ల నుండి 2032 నాటికి 351 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయన్నారు. ఇది 2023 నుండి 2032 వరకు 6.5% సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్) కు ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించారు. గత ఐదేళ్లలో మార్కెట్ ఏడాదికి 8-10 శాతం చొప్పున వృద్ధి చెందగా, వచ్చే ఐదేళ్లలో 15-20 శాతం లక్ష్యం కలిగి ఉన్నామన్నారు. పుష్కలమైన వనరులు, సాంకేతిక సామర్థ్యాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ టెక్స్ టైల్స్ కు ఉత్పత్తిదారుగానే కాక, అతి పెద్ద వినియోగదారుగా కూడా ఉండనుందన్నారు.

ఇండియన్ టెక్స్ టైల్ అసోసియేషన్ అధ్యక్షుడు అవినాష్ మైసర్ మాట్లాడుతూ సమగ్ర విధి విధానాల రూపకల్పనతో టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగం పురోగతిని సాధించనుందన్నారు. జాతీయ అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలకు లోబడి సాంకేతిక జౌళి ఉత్పత్తులకు తీసుకురాగలిగితే మార్కెటింగ్ కు కొదవ లేదన్నారు. అంతర్జాతీయంగా మంచి భవిష్యత్తు ఉన్న రంగం ఇదేనని అవినాష్ వివరించారు. కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన చేనేత, జౌళి శాఖ కమీషనర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ సాధారణ జౌళి పరిశ్రమకు పూర్తి భిన్నమైన ఈరంగం పట్ల అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నమన్నారు. మెడికల్ , అగ్రికల్చరల్ తదితర 17 రంగాలలో టెక్నికల్ టెక్స్ టైల్స్ కీలకంగా రాణిస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థ వ్యూహాలు, జియోటెక్ టెక్స్‌టైల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ వాతావరణానికి అనుగుణమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంపై తాము దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సాంకేతిక టెక్స్‌టైల్స్ రంగంలో భవిష్యత్తు పోకడలు, అవకాశాలను గుర్తించడం వంటి కీలకమైన అంశాలను ఈ సమావేశంలో చర్చించి తగిన ప్రతిపాదనలను సిద్దం చేస్తామన్నారు. పరస్పర జ్ఞాన మార్పిడికి సదస్సు వేదికగా మారిందని నాయక్ వివరించారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త అజయ్ శిరోషి మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించటంలో ఆంధ్రప్రదేశ్ స్పందన బాగుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఈరంగం గురించి పూర్తి అవగాహనతో ముందడుగు వేయాలన్నారు. ఇండియన్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ అసోసియేషన్‌కు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ నిరంతర సహకారం అందిస్తూ కార్యక్రమ నిర్వహణలో ప్రత్యేక చొరవ చూపటంతో నిశిత పరిశీలనతో కూడిన ప్యానెల్ చర్చలు జరిగాయి. ప్యానల్ స్పీకర్లుగా దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ ప్రముఖులు వ్యవహరించారు. వివిధ సంస్దల సిఇఓలు, వస్త్ర తయారీదారులు, ఇంజనీర్లు, డిజైనర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొన్నారు. వినూత్న ప్రదర్శనలో అరటి ఫైబర్, జూట్, ఉన్ని, ఇతర వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేయబడిన ఉపయోగకర ఉత్పత్తులను ప్రదర్శించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *