రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారము తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థల చట్టం, 1987 ద్వారా స్థాపించబడిన పర్మనెంట్ లోక్ అదాలత్ విధుల గురించి వివరించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య, వైద్య, తపాలా, టెలీ ఫోన్, భీమా సంస్థలు, బ్యాంకింగ్ వంటి పది రకాల సేవలకు సంబంధించిన సమస్యలను తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలోని పర్మనెంట్ లోక్ ఆదాలత్ ద్వారా పరిష్కరించుకో వచ్చని తెలిపారు.
ఈ సంస్థకు కోటి రూపాయల వరకు పరిధి ఉందని, ఈతరహా వివాదాలలో కోర్టు ఫీజు లేకుండా రాజీ మార్గం ద్వారా సత్వరమైన పరిష్కారం పొందవచ్చు అన్నారు. రాజీ కుదరని పక్షంలో విచారణ జరిపి తీర్పు ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ విషయాల పట్ల ప్రజలలో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పర్మనెంట్ లోక్ అదాలత్ సేవలను మరింత మెరుగైన విధంగా అందించేందుకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో ప్లాపస్ చైర్మన్ ఏ. గాయత్రి దేవి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి గారు, తూర్పు గోదావరి జిల్లా డి.ఈ.ఓ ఎస్. అబ్రహం, కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్ ఎస్. శ్రీధర్ , బీఎస్ఎన్ఎల్ జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ వై లక్ష్మణ రావు , వివిధ భీమా సంస్థల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.