– ఈ నెల 9న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9వ తేదీన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్‌లక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను కలెక్టర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం ఏర్పడుతుందని.. ఎక్కువగా అలసిపోతారని, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు వంటివాటితో పాటు బరువు తగ్గుతుందన్నారు. వివిధ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వివరించారు. అల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారినపడకుండా చూడొచ్చన్నారు. ఈ నెల 9వ తేదీన 1-19 ఏళ్ల వయసు వారందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ జరుగుతుందని.. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి, తమ పిల్లలు మాత్రలు తీసుకునేలా చూడాలన్నారు. 1-2 సంవత్సరాల చిన్నారులకు సగం మాత్ర (200 మి.గ్రా.), ఆపైన 19 ఏళ్ల వయసు వరకు ఒక మాత్ర (400 మి.గ్రా.) తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 9న మాత్రలు తీసుకోకుండా మిగిలి పోయిన వారికి ఫిబ్రవరి 16వ తేదీన మాత్రలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యా సంస్థల్లో గోడపత్రికల ద్వారా నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన కల్పించి.. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ తదితర విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్‌తమంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీసీహెచ్ఎస్ బీసీకే నాయక్, జిల్లా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి డా.మాధవి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జి.వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.