-గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్ర ఉపాధ్యాయులకు 3 రోజుల పాటు శిక్షణ
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఐ.ఎ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు వినూత్న బోధనతో ఆకట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు కొత్త విషయాలను తెలుసుకోవాలని, ప్రస్తుత డిజిటల్ యుగంలో బోధించాలంటే ఉపాధ్యాయునికి మరింత పటిష్టమైన సాధన అవసరమని, ఆ అవసరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. మన బడి: నాడు- నేడులో పనులు పూర్తి చేసుకున్న పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెళ్లు ఏర్పాటు చేశారని, అలానే 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, బోధించే ఉపాధ్యాయులకు ట్యాబులు ఇచ్చారని తెలిపారు. వీటి ద్వారా ఉపాధ్యాయులు మరింత ప్రభావవంతంగా బోధించడానికి వీలుగా గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్ర సబ్జెక్టుల ఉపాధ్యాయుల కోసం ICT అనుకరణలపై 3 రోజుల రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 2,3,5 తేదీల్లో 121 డివిజనల్ వేదికల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. సోమవారంతో ఈ శిక్షణ ముగిసిందని రాష్ట్ర వ్యాప్తంగా 30579 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారని అన్నారు. వీరికి గతంలో ఐఐటీ మద్రాస్ (ప్రవర్తక్) నిపుణులతో శిక్షణ పొందిన 14 మంది స్టేట్ రిసోర్సు పర్సన్లు, 1520 మంది జిల్లా రిసోర్సు పర్సన్లు మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణ అందించారని అన్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు, క్విజ్, గూగుల్ బార్డ్ (ప్రశ్నలను సృష్టించడం, అడిగినప్పుడు సమాచారాన్ని అందించడం మొదలైనవాటిని మనం కోరుకునే ఏదైనా పని చేసే ఒక A.I సాధనం), జియోజిబ్రా సాధనం (ఐఎఫ్‌పిలో ఏ విధమైన గ్రాఫికల్ ఫార్ములేషన్ లేదా ఇంటర్‌ప్రెటేషన్‌ను సులభంగా అమలు చేయడం కోసం), టార్సియా గ్రిడ్స్ (కొత్త విషయాలను నేర్చుకోవడంలో పిల్లల ఉత్సాహాన్ని పెంచడం మరియు కొనసాగించడం కోసం ఒక పజిల్ సాఫ్ట్‌వేర్), రోబో కంపాస్ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌పై సులభంగా జ్యామితికి, భౌతిక శాస్త్రాలకు సంబంధించిన అంశాలను బోధించడానికి), చాట్ GPT, Play Posit, H5P మొదలైన విభిన్న A.I టూల్స్ ద్వారా ఇంటరాక్టివ్ వీడియో తయారీ అంశాలపై శిక్షణ ఇచ్చామని అన్నారు. ఈ శిక్షణ వల్ల పాఠశాలల్లో మరింత నాణ్యమైన విద్యతో పాటు ప్రతిభావంతమైన బోధన ఉంటుందని తెలిపారు.