– ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజన్ ఫౌండేషన్-విద్యాదర్శిని ఐఏఎస్ అకాడమీ నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ ఉచిత మాక్ టెస్ట్‌లను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి.వెంకటేశ్వర్లు, విజన్ ఫౌండేషన్ డైరెక్టర్ జి.విజయ్‌కుమార్ తదితరులతో కలిసి మాక్ టెస్ట్‌ల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ విజన్ ఫౌండేషన్ (విద్యాదర్శిని ఐఏఎస్ అకాడమీ) ఆధ్వర్యంలో ఈ నెల 11, 14, 17, 20, 23వ తేదీల్లో మాక్ టెస్ట్‌లు జరగనున్నాయని.. త్వరలో గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ మాక్‌టెస్ట్‌లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌లో బలాలు బలహీనతలను తెలుసుకోవడంతో పాటు అసలు పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్ష రాసేందుకు ఈ మాక్‌టెస్ట్‌లు దోహదం చేస్తాయన్నారు. ఫౌండేషన్ డైరెక్టర్ జి.విజయ్ కుమార్ మాట్లాడుతూ మాక్‌టెస్ట్‌లు రాయాలనుకునే అభ్యర్థులు 9390 227 500 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. బెంజ్ సర్కిల్, సాయి టవర్స్‌లోని విజన్ ఫౌండేషన్ కార్యాలయంలో పరీక్షలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ సభ్యులు జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.