-ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం తో సమావేశం
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారులను నులిపురుగుల నుండి కాపాడుకోవడానికి, జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలందరిలో నులిపురుగులు వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన కలిగిస్తూ, నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు ఒకటి నుండి 19 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి ఫిబ్రవరి 9న ఆల్బెండజోల్ మాత్రను ఖచ్చితంగా చేరేటట్టు చూడాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యంది అని, కమిషనర్ స్వప్నిల్ అన్నారు.
విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కొత్త భవనంలో ఉన్న మీటింగ్ హాల్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం సాయంత్రం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ మాట్లాడుతూ ఎంఈఓ లు ప్రతి ఒక్క స్కూలు యాజమాన్యానికి పిల్లల నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు డైరీలో రాయడం ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం ద్వారా కానీ సమాచారాన్ని తెలియపరచాలన్నారు. తల్లిదండ్రులకే కాకుండా విద్యార్థులలో కూడా నులిపిరుగుల వల్ల కలిగే రక్తహీనత, ఆకలి మందగించడం, తరచూ విరోచనాలు కావటం, బరువు తగ్గటం మొదలగు నష్టాలను వివరిస్తూ, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉదాహరణకి గోర్లు శుభ్రం చేసుకోవడం, కలుషిత ఆహారం తీసుకోకుండా ఉండటం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండ ఉండటం మరియు ఆ ప్రదేశాలలో సంచరించకుండా ఉండటం లాంటివి చేయడం వల్ల నులిపురుగుల నుండి ఎటువంటి సమస్యలు తలెత్తవని విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
విద్యార్థులు వాడే కామన్ బాత్రూమ్స్ వల్ల సమస్యలు వస్తుంటాయి కాబట్టి, ప్రతి ఒక్క విద్యార్థికి ఒకేసారి సింగిల్ షాట్ లో ఆల్బెండజోల్ మాత్రను వేయడం వలన నులిపురుగుల వల్ల కలుగు వ్యాధులను మనం అరికట్టవచ్చని, ప్రతి ఒక్క విద్యార్థికి తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రం వేసేటట్టు చూడాలని, విద్యార్థుల ఆరోగ్యం సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుల్లో ఉందని, అన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) కె. శకుంతల, చీఫ్ మెడికల్ హల్త్ ఆఫీసర్ డా. పి. రత్నావళి, ఎంఈవోలు, స్కూల్ సూపర్వైజర్లు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.