– ఎస్‌పీఎల్‌లో పతకాలు సాధించిన చిన్నారులకు కలెక్టర్ డిల్లీరావు అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ యుద్ధ కళ సిలంబం (కర్రసాము)లో తెలుగు తేజాలు చూపిన ప్రతిభ చాలా గొప్పదని.. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు అందుకుంటూ జిల్లా, రాష్ట్ర కీర్తిని దశదిశలా విస్తరించేందుకు కృషిచేయాలని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. దేశంలో తొలిసారిగా వరల్డ్ యూనియన్ సిలంబం ఫెడరేషన్ (డబ్ల్యూయూఎస్ఎఫ్).. జనవరి 26-28 వరకు మధురైలో నిర్వహించిన సిలంబం ప్రీమియర్ లీగ్‌లో రజతం, కాంస్య పతకాలు సాధించిన చిన్నారులు కోచ్ కె.సత్య శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు.. పతకాలు సాధించిన చిన్నారులను అభినందించి.. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. పురాతన యుద్ధ కళ అయిన సిలంబం ప్రత్యేక క్రీడలో విజయవాడ చిన్నారులు ప్రతిభ చూపడం మనందరికీ గర్వకారణమన్నారు. సిలంబంలో ప్రతిభావంతులను వెలికితీస్తున్న కోచ్ సత్య శ్రీకాంత్‌ను కలెక్టర్ డిల్లీరావు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో క్రీడా రంగ అభివృద్ధికి విశేష కృషిచేస్తోందని.. మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ.. వినూత్న కార్యక్‌డమాలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు.
కోచ్ సత్య శ్రీకాంత్ మాట్లాడుతూ సిలంబం ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్)లో మొత్తం 228 జట్లు పాల్గొనగా.. విజయవాడ నుంచి మూడు జట్లు పాల్గొన్నట్లు తెలిపారు. అండర్-17 కేటగిరీలో బాలికల జట్టు రజతంతో పాటు రూ. 25 వేల నగదు బహుమతి, అండర్-10 బాలురు, బాలికల జట్లు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నట్లు వివరించారు. జి.ప్రఘ్న్య, హియా ముఖేష్ జైన్, పి.రోషిని, పి.హారికలతో కూడిన అండర్-17 బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి రజతంతో పాటు రూ. 25 వేల నగదు బహుమతి సాధించినట్లు వెల్లడించారు. వి.సాత్విక్, జి.సూర్య ప్రణవ్, ఎంఎన్‌వీడీ మోక్షిత్‌ల అండర్-10 బాలుర జట్టుతో పాటు మాన్య ముఖేష్ జైన్, పి.శ్రీ రూప కార్తీష, పి.శ్రీకర లాస్యల అండర్-10 బాలికల జట్టు కాంస్య పతకాలు సాధించినట్లు కోచ్ సత్య శ్రీకాంత్ తెలిపారు.