-ప్రజల ముంగిటకు సుపరిపాలన అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
-ప్రజా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్లే…
-వినతులకు సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ
తొట్టంబేడు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నేటి మండల స్థాయి జగనన్నకు చెబుదాంకు వచ్చిన 45 వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ తెలిపారు.
శుక్రవారం శ్రీకాళహస్తి నియోజక వర్గం లోని తొట్టంబేడు మండలం ఎస్.ఎస్ ఫంక్షన్ హాల్ నందు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పలు ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి వినతులను స్వీకరించి అక్కడే ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ముంగిటకు సుపరిపాలన అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, సచివాలయ సిబ్బంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, సేవలను ప్రజలకు తెలిసేలా వారికి చెప్పాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఏదేని సమస్యలు ఉన్నా ప్రజలకు 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం అందుబాటులో తెచ్చిందని, దీని ద్వారా సదరు ఫోన్ కాల్ నుండి అందిన ఫిర్యాదులను ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది అని, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు. మన జిల్లాలో దాదాపుగా చాలావరకు స్పందన అర్జీల పరిష్కారం చేస్తున్నారని, మరింత మెరుగ్గా చేయాలని, ప్రజా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్లే అని, సచివాలయం సిబ్బంది, అధికారులు అందరూ బాధ్యతగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా సానుకూల దృక్పథంతో పని చేయాలనీ అన్నారు. నిర్ణీత కాల వ్యవధి లోపు ప్రజల అర్జీలకు అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నిబంధనల మేరకు పరిష్కరించగలిగిన అర్జీలను త్వరిత గతిన పరిష్కరించాలని నిబంధనల పరిధిలో లేని పరిష్కరించలేని వాటిని అర్జీదారులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు. ఆర్థికేతర అర్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ ఉంచరాదని తెలిపారు. ఆర్థిక అంశాలతో ముడిపడిన వాటిని ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత శాఖలు పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు :
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ -4, ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -1, పౌరసరఫరాల శాఖ -1, గ్రామ వార్డు సచివాలయాలు -1, మున్సిపాలిటీ-1, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -3, రెవెన్యూ -26, గ్రామీణ నీటిపారుదల శాఖ- 4, సర్వే ల్యాండ్స్ అండ్ రికార్డ్స్- 3, వాటర్ రిసోర్సెస్- 1 కలిపి మొత్తం 45 వినతులు అందాయని, జిల్లా అధికారులు జేకేసీ లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిందిగా జగనన్నకు చెబుదాం – స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, డిఎల్డిఓ ఆదిశేషారెడ్డి, వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, ఎంపిడిఓ, తహశీల్దార్ శివరామ సుబ్బయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.