-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో బ్లెండెడ్ లెర్నింగ్ కోర్సుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్, 21వ శతాబ్దపు నైపుణ్యాలపై సామర్థ్యాలను పెంపొందించేందుకు, తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడానికి ఉపాధ్యాయులకు బోధన, సాంకేతికత, ఉపాధ్యాయ నాయకత్వ నైపుణ్యాలను సన్నద్ధం చేయడానికి అమెజాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు.
శుక్రవారం విజయవాడలోని సాల్ట్ (Supporting Andhra’s Learning Transformation) కార్యాలయంలో అమెజాన్ ఇండియా ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం 2024-25 విద్యా సంవత్సరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 10,000 మంది విద్యార్థులు, 500 మంది ఉపాధ్యాయులకు కంప్యూటర్ సైన్స్ విద్యను అందజేస్తుందని, 2026-27 నాటికి 21వ శతాబ్దపు నైపుణ్యాల పాఠ్యాంశాల ద్వారా రాష్ట్రంలోని లక్షమంది విద్యార్థులు ప్రయోజనం పొందడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భారతదేశంలో భవిష్యత్ టెక్ టాలెంట్ పూల్ ను నిర్మిస్తాయని ఎస్పీడీ బి. శ్రీనివాసరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి, కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి, శామో జాయింట్ డైరెక్టర్ బి.విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు: అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్, ఇండియా లీడ్, అక్షయ్ కశ్యప్
అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్, ఇండియా లీడ్, అక్షయ్ కశ్యప్ మాట్లాడుతూ ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమం ద్వారా భవిష్య నైపుణ్యాలకు అనుగుణంగా కంప్యూటర్ సైన్స్‌ని కీలక నైపుణ్యంగా గుర్తించామని, గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది విద్యార్థులు మరియు 8,000 మంది అధ్యాపకులకు కంప్యూటర్ సైన్స్ విద్యను అందించామన్నారు. తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ విద్యను తీసుకురావడానికి, విద్య యొక్క భవిష్యత్తును రూపొందించే మా ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ద్వారా కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్ లెర్నింగ్‌ను U.S., U.K., కెనడా, ఫ్రాన్స్, భారతదేశంలో అందుబాటులో ఉందని, అమెజాన్ కార్యక్రమాల గురించి www.amazon.in/aboutus ని సందర్శించవచ్చని పేర్కొన్నారు.