-ఉపాధి రక్షణ సామజిక న్యాయం వంటి అంశాలలో అసమానతలు తొలగాలి.
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి రక్షణ సామజిక న్యాయం వంటి అంశాలలో అసమానతలను రూపుమాపేందుకు మరో సామాజిక విప్లవానికి నాంది పలికి సంపూర్ణ సామజిక న్యాయాన్ని సాధించగలుగుతామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక హనుమాన్ పేటలోని టీవీ భవన్ నందు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, మేరీస్ స్టెల్లా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను రూపుమాపటంలో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. ఉపాధి సామాజిక రక్షణ సామాజిక సంభాషణ ప్రాథమిక సూత్రాలు ద్వారా అందరికీ న్యాయ బద్దమైన ఫలితాలను హామీలను ఇవ్వటంతో పాటు లింగ సమానత్వం, కుల వివక్షత రూపుమాపడం, పేదరిక నిర్మూలన వంటి సవాళ్లను అధికమించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలులోకి తీసుకొచ్చి సమాజంలో అసమానతలు రూపుమాపటానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. సామజిక న్యాయం కొరకు అహర్నిశం కృషి చేసిన మేధావి భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని అసమానతలు లేని సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో సామజిక న్యాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆయా దేశాలలో కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా సామజిక జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఉన్నత స్థాయి విద్యావంతులు కూడా కుల, మత, సామజిక, ఆర్ధిక పరమైన అంశాలలో సంకుచిత ఆలోచనలు చేస్తూ సామజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. సమాజంలో ఇటువంటివి వాంఛనీయం కాదని వీటిని రూపుమాపాలంటే మరో సామజిక విప్లవం అవసరమని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ పి. విజయ బాబు మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో అసమానతలు రూపుమాపుతాయన్నారు. అసమానతలను రూపుమాపేందుకు నేటి యువత ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. మ్యారేజ్ స్టిల్లా కళాశాల సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి సిస్టర్ సహాయమేరి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటుగా సామాజిక చైతన్యం అవగాహన కొరకు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి జిల్లా యంత్రాంగానికి ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ శ్రీ బిఎస్. కోటేశ్వరావు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ 25 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుందన్నారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమాజ చైతన్యంలో భాగంగా బాలలు, మహిళలు, మానవ హక్కులు చట్టాలపై విస్పృత ప్రచారం నిర్వహించి చైతన్య వంతులను చేస్తున్నామన్నారు. గత 23 సంవత్సరములుగా చైల్డ్ లైన్ ద్వారా 46,500 మంది పిల్లలను రక్షించడం సంరక్షించడం జరిగిందన్నారు.
బాలలపై హింసను అరికట్టాలి, ఓటరు పై అవగాహన చైతన్యం కొరకు ఏర్పాటు చేసిన పోస్టర్లను ఆవిష్కరించి అనంతరం సామజిక న్యాయాన్ని పాటిస్తామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు విద్యార్థిని విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించారు.
దిశ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ ఎండి అహ్మదున్నీసా, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కో ఆర్డినేటర్ అరవ రమేష్, జనశిక్షణ సంస్థ చైర్మన్ నాగళ్ల విద్యా కన్నా, ప్రముఖ సంఘ సేవకులు చుక్కపల్లి అరుణ్ కుమార్, జన శిక్షణ సంస్థ డైరెక్టర్ పూర్ణిమ, ప్రజా గాయకులు ఆర్. పిచ్చయ్య, బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ కోటి ప్రకాష్, మేరీస్ స్టెల్లా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.